దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల స్థితిగతులపై ఆర్థిక సర్వే కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా డెలివరీ బాయ్స్, రైడర్లు, క్విక్ కామర్స్ పై ఆధారపడుతున్న వారి సంఖ్య శరవేగంగా పెరుగుతున్నప్పటికీ.. వారి ఆదాయం అలాగే సోషల్ సెక్యూరిటీ మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయని సర్వే స్పష్టం చేసింది. భారత్‌లోని గిగ్ వర్కర్లలో దాదాపు 40 శాతం మంది నెలకు రూ.15వేల కంటే తక్కువ సంపాదిస్తున్నారని రిపోర్ట్ వెల్లడించింది. ఇది వారి జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొంది.
ఈ రంగంలో పనిచేస్తున్న వారి ప్రధాన సమస్య ఆల్గారిథమ్ కంట్రోల్స్ అని సర్వే గుర్తించింది. ప్లాట్‌ఫారమ్‌ల వెనుక ఉండే సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లే ఎవరికి ఎంత పని ఇవ్వాలి.. ఎంత వేతనం చెల్లించాలి.. ఎవరి పనితీరు ఎలా ఉంది అనే అంశాలను నిర్ణయిస్తున్నాయని పేర్కొంది. దీనివల్ల కార్మికుల్లో ఒత్తిడి పెరగడమే కాకుండా, వివక్షకు కూడా దారితీస్తోందని హైలైట్ చేసింది. ముఖ్యంగా ఆర్డర్ కోసం వేచి ఉండే సమయానికి ఎటువంటి పేమెంట్ అందకపోవడం పెద్ద లోపమని సర్వే వేలెత్తి చూపింది. దీనిని సవరించడానికి గంటకు కనీస వేతనం లేదా ప్రతి పనికి కనీస ఆదాయం విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
Also Read : జంక్ ఫుడ్ యాడ్స్‌పై ఆర్థిక సర్వే హెచ్చరిక
గిగ్ వర్కర్లకు ఆర్థిక చేయూత అందడం లేదని.. వారికి క్రెడిట్ కార్డులు, లోన్స్ పొందటం కష్టంగా మారుతోందని నివేదిక తెలిపింది. అలాగే ఏఐ, మెషీన్ లెర్నింగ్ వంటి సాంకేతిక మార్పుల వల్ల తమ ఉపాధి ఎక్కడ పోతుందోననే భయం వారిని వెంటాడుతోంది. చాలామంది కార్మికులు తమ వృత్తిలో ఎదుగుదలను చూస్తున్నా.. బైక్, కార్ వంటివి కొనుక్కోవటానికి ఇబ్బంది పడుతూ తక్కువ స్థాయి పనులకే పరిమితమవుతున్నారు. అందుకే ప్లాట్‌ఫారమ్ కంపెనీలు కార్మికులకు శిక్షణ ఇవ్వడంతో పాటు, అవసరమైన పరికరాల కొనుగోలులో కో-ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని సర్వే సూచించింది.
గత కొన్నేళ్లుగా గిగ్ వర్కర్లు మెరుగైన వేతనాలు, 10 నిమిషాల డెలివరీ డెడ్ లైన్ల రద్దు కోసం చేస్తున్న పోరాటాలను ప్రభుత్వం గుర్తించింది. దేశ ఆర్థిక వ్యవస్థలో వీరి వాటా 2 శాతానికి పైగా ఉందని.. 2029-30 నాటికి వీరి సంఖ్య మరింత పెరిగి రూ.2లక్షల 35వేల కోట్ల జీడీపీని అందించే అవకాశం ఉందని అంచనా వేసింది. కాబట్టి గిగ్ పనిని కేవలం తాత్కాలిక ఉపాధిగా చూడకుండా.. వారికి సామాజిక భద్రత, పారదర్శకమైన వేతనాలు, చట్టపరమైన గుర్తింపు కల్పించడం ద్వారానే ఈ రంగాన్ని బలోపేతం చేయాలని సర్వే పేర్కొంది.
