దేశంలో జంక్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వాడకం ప్రమాదకర స్థాయికి చేరుకుందని ఆర్థిక సర్వే 2026 తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీని కారణంగా దేశంలో ఒబెసిటీ సమస్య పెరగటం తద్వారా అనుబంధ వ్యాధులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం విప్లవాత్మకమైన ప్రతిపాదనలు చేసింది. ముఖ్యంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు టీవీలు, సోషల్ మీడియా, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో జంక్ ఫుడ్ యాడ్స్ పూర్తిగా నిషేధించాలని రిపోర్ట్ సూచించింది.
ఎక్కువ ఫ్యాట్స్, ఉప్పు, చక్కెర కలిగిన ఆహార పదార్థాల విక్రయాల్లో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా మారిందని సర్వే పేర్కొంది. 2009 నుంచి 2023 మధ్య కాలంలో వీటి అమ్మకాలు 150 శాతానికి పైగా పెరిగాయని, ఇదే సమయంలో దేశంలో ఊబకాయం బాధితుల సంఖ్య కూడా రెట్టింపు అయిందని లెక్కలతో సహా వివరించింది. బర్గర్లు, నూడుల్స్, పిజ్జా, సాఫ్ట్ డ్రింక్స్ లాంటి జంక్ ఫుడ్స్ వల్ల కలిగే అనర్థాల నుంచి పిల్లలను కాపాడటానికి.. చిలీ, నార్వే, బ్రిటన్ వంటి దేశాలు అనుసరిస్తున్న కఠిన నిబంధనలను భారత్‌లోనూ అమలు చేయాలని సూచించింది ఎకనమిక్ సర్వే రిపోర్ట్.
►ALSO READ | గోల్డ్ సిల్వర్ ఇంకా పెరుగుతాయ్..! రేట్లు తగ్గాలంటే ఆ రెండూ జరగాల్సిందే: ఆర్థిక సర్వే రిపోర్ట్
చిన్నారుల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని సర్వే కోరింది. 5 ఏళ్ల లోపు పిల్లల్లో అధిక బరువు సమస్య 2015-16లో 2.1 శాతంగా ఉండగా.. 2019-21 నాటికి 3.4 శాతానికి పెరగడం ఆందోళనకరమని పేర్కొంది. దీనిని అరికట్టేందుకు పసిపిల్లల పాల ఉత్పత్తులు, డ్రింక్స్ మార్కెటింగ్‌పై కఠినమైన ఆంక్షలు తీసుకురావాలని సూచించింది. కేవలం వినియోగదారుల ప్రవర్తన మారితే సరిపోదని, ప్రభుత్వ పరంగా బలమైన విధానాలు ఉండాలని సర్వే నొక్కి చెప్పింది. ఆహార పదార్థాల ప్యాకెట్లపై స్పష్టమైన న్యూట్రిషన్ లేబులింగ్ ఉండాలని, తద్వారా వినియోగదారులు తాము తినే ఆహారంలోని ప్రమాదకర స్థాయిలను గుర్తించవచ్చని తెలిపింది.
ప్రస్తుతం ఉన్న ప్రకటనల నిబంధనల్లో స్పష్టత లేకపోవడాన్ని సర్వే ఎత్తిచూపింది. కంపెనీలు తమ ఉత్పత్తుల గురించి హెల్త్, ఎనర్జీ వంటి పదాలు వాడి యూజర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని, వాటిని అరికట్టేందుకు ఖచ్చితమైన పోషక ప్రమాణాలను నిర్దేశించాలని సూచించింది. విద్యాసంస్థల్లో జంక్ ఫుడ్ కంపెనీల స్పాన్సర్‌షిప్‌లను కూడా అరికట్టాలని ప్రతిపాదించింది. 2035 నాటికి దేశంలో ఊబకాయంతో బాధపడే పిల్లల సంఖ్య 8.3 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తూ.. భారత్ ఆరోగ్యకరమైన భవిష్యత్తు వైపు సాగాలంటే నయా సంస్కరణలు అవసరమని రిపోర్ట్ తేల్చి చెప్పింది.
