పూత నిలవలే.. కాత రాలే మామిడి తోటలకు గడ్డుకాలం

పూత నిలవలే.. కాత రాలే మామిడి తోటలకు గడ్డుకాలం
  •     ముంచిన తేనెమంచు తెగులు
  •     ఆందోళనలో మామిడి రైతులు 
  •     జిల్లాలో 18 వేల ఎకరాల్లో తోటలు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో మామిడి తోటలకు ఈ ఏడాది గడ్డు కాలం ఎదురైంది. మొన్న విరగబూసిన తోటలు ఇప్పుడు పూత రాలిపోయి కాత లేక వెలవెలబోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా పూత రావడంతో ఆనందంలో తేలిన రైతులు ప్రస్తుతం బోసిపోతున్న తోటలను చూసి గుండెలు బాదుకుంటున్నారు. తేనెమంచు, తామర, మసి తెగుళ్లు మామిడి రైతులను దెబ్బతీశాయని పలువురు వాపోతున్నారు. 

సాధారణంగా ఎకరానికి ఐదు టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా, ఈసారి ఒకటి రెండు టన్నులు కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు. ఎన్ని మందులు కొట్టినా పూత నిలువలేదని, పెట్టుబడులు సైతం చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

18వేల ఎకరాల్లో తోటలు..

మంచిర్యాల జిల్లావ్యాప్తంగా దాదాపు 18వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. ఇందులో ఎక్కువగా మందమర్రి, బెల్లంపల్లి, తాండూర్, నెన్నెల, జైపూర్, భీమారం, హాజీపూర్, లక్సెట్టిపేట మండలాల్లోనే ఉన్నాయి. సగానికి పైగా తోటలు ఇరవై నుంచి నలభై ఏండ్ల మధ్యలో ఉండగా మిగతావి ఐదు నుంచి ఇరవై సంవత్సరాల లోపు ఉన్నాయి. బంగినపల్లి, దశరి, చిన్నరసం, పెద్దరసం, తోతాపురి, నీలం వంటి వెరైటీలను సాగు చేస్తున్నారు. 

కొన్నేండ్లుగా ఆశించిన దిగుబడి రాకపోవడం, మార్కెటింగ్​ సౌకర్యం లేకపోవడం, గిట్టుబాటు ధర లభించకపోవడం వంటి కారణాలతో పలువురు రైతులు మామిడి తోటలను తొలగించి పత్తి, ఇతర పంటలు వేస్తున్నారు. దీంతో జిల్లాలో తోటల విస్తీర్ణం క్రమంగా తగ్గితోందని అధికారులు పేర్కొంటున్నారు. 

దెబ్బతీసిన తెగుళ్లు..

ఈసారి డిసెంబర్, జనవరిలో మామిడి తోటలు విరగబూశాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పచ్చదనంతో కళకళలాడడంతో రైతులు ఆనందంలో మునిపోయారు. కానీ అంతలోనే చలి వాతావరణం, మబ్బుల కారణంగా తేనెమంచు తెగులు సోకి పూత పూర్తిగా రాలిపోయింది. తెగుళ్ల నివారణకు రెండు మూడుసార్లు మందులు కొట్టినా ఫలితం దక్కలేదని రైతులు తెలిపారు. అక్కడక్కడ కొద్దిపాటి పిందెలు పడగా కిందటి నెలలో కురిసిన వానకు అవి కూడా రాలిపోయాయి. 

జగిత్యాల జిల్లాలో..

జగిత్యాల , వెలుగు :జగిత్యాల జిల్లాలో మామిడి పంటపై తేనె మంచు, బ్లాక్ ట్రిప్స్ తెగుళ్ల ప్రభావం కనిపిస్తోంది. పూతదశలో ఉన్న తోటల్లో పురుగుల దాడి పెరుగుతుండడంతో ఈసారి దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు, మామిడి వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 35 వేల ఎకరాల్లో సాగవుతున్న మామిడి తోటలు ప్రస్తుతం తెగుళ్ల ముప్పును ఎదుర్కొంటున్నాయి. సమయానికి ముందే పూత రావడంతో ఆనందం వ్యక్తం చేసిన రైతులు ఇప్పుడు రాలిపోవడంతో టెన్షన్‌‌ పడుతున్నారు. 

35 వేల ఎకరాల్లో సాగు

జిల్లాలో మెట్‌‌పల్లి, మల్లాపూర్, కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల రూరల్ మండలాల్లో మామిడి సాగు విస్తారంగా జరుగుతోంది. సాధారణంగా ఏటా లక్ష టన్నులకు పైగా మామిడి దిగుబడి వస్తుంది. ఈసారి వాతావరణ మార్పులు, ఉదయం వేళల్లో పడుతున్న తేనే మంచు కారణంగా తోటల్లో బ్లాక్ ట్రిప్స్ వంటి పురుగులు పెరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. తేనె మంచు పురుగులు వదిలే తీపి ద్రవం ఆకులపై పేరుకుపోయి బ్లాక్ ఫంగస్ ఏర్పడేలా చేస్తుంది. దీంతో దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.

పూత దశలో తెగుళ్లతో టెన్షన్.. 

పూత దశలోనే తెగుళ్లు రావడంతో టెన్షన్ అవుతోంది. పొద్దున తేనె మంచు పడుతుండడంతో తోటల్లో బ్లాక్ ట్రిప్స్ పురుగులు పెరుగుతున్నాయి. వెంటనే వాటిని కంట్రోల్ చేయకపోతే దిగుబడి తగ్గుతుంది. 
- రమేశ్‌‌, మామిడి రైతు, 
జగిత్యాల జిల్లా గొల్లపల్లి

జాగ్రత్తలు తీసుకుంటే మేలు.. 

జిల్లాలో మొదటి దశలో డిసెంబర్​లో పూత వచ్చింది. రైతులు ముందస్తు చర్యగా అక్టోబర్, నవంబర్ నుంచే తేనెమంచు, తామర పురుగుల నివారణకు మందులు స్ప్రే చేశారు. దాని ప్రభావంతో కొంత వరకు పూత, పిందె నిలిచింది. కానీ ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతల వల్ల పిందె మాడిపోయి రాలిపోతోంది. ఎండ తీవ్రత, అకాల వర్షాలు, మబ్బు వాతావరణం పరిస్థితులను ఎదుర్కొనేందుకు హార్టికల్చర్​ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలి. - అనిత, మంచిర్యాల జిల్లా హార్టికల్చర్​ ఆఫీసర్​