మైనింగ్‌‌ మాఫియాను అరికట్టాలి : మంత్రి తుమ్మల

మైనింగ్‌‌ మాఫియాను అరికట్టాలి : మంత్రి తుమ్మల
  •     యూరియా కొరత ఉండొద్దు
  •     అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష

హైదరాబాద్‌‌, వెలుగు : మైనింగ్‌‌ మాఫియాను అరికట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం మంత్రి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలంలో జరిగిన అక్రమ గ్రావెల్, బెరైటీస్ తవ్వకాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అక్కడ జరుగుతున్న మైనింగ్ మాఫియాను అరికట్టాలని, ఎవరినీ వదిలి పెట్టొద్దని హెచ్చరించారు. యాసంగి సీజన్‌‌లో యూరియా కొరత లేకుండా చూడాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. 

ఇటీవల నిర్మల్ జిల్లాలో యూరియా కొరతకు సంబంధించి  మంత్రి వ్యవసాయశాఖ అధికారులను ప్రశ్నించారు. ఇటీవల జరిగిన లారీల  సమ్మె కారణంగానే యూరియా రవాణా సమస్య ఎదురై కొరత ఏర్పడిందని,  సమ్మె విరమణ తర్వాత సరిపడా నిల్వలు చేర్చామని అధికారులు మంత్రికి వివరించారు. మార్కెట్లలో మిర్చి ధరలు, పంటలకు తెగుళ్ల నియంత్రణ చర్యలపై మంత్రి సమీక్షించారు. పంటల వైవిధ్యంతో రైతుల ఆదాయం పెంచుకోవడంపై అవగాహన కల్పించేందుకు రైతు వేదికలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. 

రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో అధికంగా పండించే వరి పంట ఎగుమతికి సంబంధించి  భారత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. ఇటీవల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమలో తలెత్తిన సమస్యలపై మంత్రి సమీక్షించారు.