రైతులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లే : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రైతులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లే : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కోరుట్ల/గొల్లపల్లి/ధర్మపురి, వెలుగు: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ప్రకటించడం తప్ప కొనుగోలు విషయంలో రాష్ట్రానికి ఎలాంటి సహకారం అందించడం లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  తెలిపారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్ పల్లి, గొల్లపల్లి, ధర్మపురి వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సంజయ్, కలెక్టర్​ సత్యప్రసాద్, కాంగ్రెస్​ కోరుట్ల నియోజకవర్గ ఇన్​చార్జి జువ్వాడి నర్సింగరావుతో కలిసి  ప్రారంభించారు.

రైతులు పంట మార్పిడిలో భాగంగా జగిత్యాల జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగు చేశారని మంత్రి తెలిపారు. రైతులు పండించిన మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 500 కోట్ల భారం పడుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా కోరుట్ల నియోజకవర్గంలో 4 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

కోరుట్ల ఏఎంసీ చైర్మన్​ పన్నాల అంజిరెడ్డి, మున్సిపల్​ చైర్​పర్సన్​ తిరుమల వసంత, ఆర్డీవో జీవాకర్​రెడ్డి, తహసీల్దార్​ కృష్ణచైతన్య, ఏడీఏ రమేశ్, ఆర్డీవో మధుసూదన్, గొల్లపల్లి ఏఎంసీ చైర్మన్  సంతోష్, వైస్  చైర్మన్  రాజిరెడ్డి, ధర్మపురి ఏఎంసీ చైర్​పర్సన్​ చిలుముల లావణ్య లక్ష్మణ్, లైబ్రరీ చైర్మన్  సంగనభట్ల దినేశ్, మున్సిపల్  చైర్​పర్సన్  వేముల నాగలక్ష్మి పాల్గొన్నారు.

పార్టీ మారడం జీవన్ రెడ్డి వ్యక్తిగత నిర్ణయం.. 

మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మారడం ఆయన వ్యక్తిగత విషయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  తెలిపారు. కాంగ్రెస్ తో ఏండ్లుగా ఉన్న అనుబంధం కారణంగా పార్టీ మారవద్దని పీసీసీ చీఫ్, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు స్వయంగా కలిసి కోరామని చెప్పారు.

2014 ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్  అనేక హామీలు ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తామని చెప్పి పట్టించుకోలేదన్నారు. 2029లో రేవంత్ రెడ్డి మరోసారి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులతో పాటు నిజామాబాద్  ఎంపీ ధర్మపురి అర్వింద్​ రాష్ట్రంలోని గోదాముల్లో నిల్వ ఉన్న బియ్యాన్ని తరలించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్  చేశారు. కేంద్ర ప్రభుత్వంతో పనులు చేయించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు.

మృతుల కుటుంబాలకు పరామర్శ

పెగడపల్లి: పెగడపల్లి మండలంలోని పలు గ్రామాల్లోని ఇటీవల చనిపోయిన వారి కుటుంబాలను మంత్రి లక్ష్మణ్ కుమార్  పరామర్శించారు. వారి ఇండ్లకు వెళ్లి మృతుల ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మార్కెట్  కమిటీ డైరెక్టర్  చాట్ల విజయభాస్కర్  కొడుకు విక్రమ్  రోడ్డు ప్రమాదంలో గాయపడగా పరామర్శించారు.

మంత్రిని కలిసిన విద్యార్థులు..

కరీంనగర్ టౌన్: మంత్రి అడ్లూరి  లక్ష్మణ్​ కుమార్ ను శాతవాహన యూనివర్సిటీ  జేఏసీ  విద్యార్థులు కలిసి యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలను వివరించారు. సోషల్  మీడియాలో అసత్య ప్రచారం చేయిస్తున్నారని, యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం  కలిగిస్తూ, దళిత ప్రొఫెసర్లను,  విద్యార్థులను వేధిస్తున్న  వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. కరికే మహేశ్, శివాజీ, సుమన్, రమేశ్, సాయి కిరణ్  పాల్గొన్నారు.