
- పార్టీలో తగిన గౌరవం ఉంటుందని కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షీ ఫోన్
- కాంగ్రెస్‌లోనే ఉంటా.. ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేస్తానన్న జీవన్‌రెడ్డి
- మండలి చైర్మన్‌ను కలిసి రాజీనామా లేఖ ఇచ్చే ప్రయత్నం
- అందుబాటులో లేకపోవడంతో నేడు కలవాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ కాంగ్రెస్‌లో ‘జగిత్యాల చిచ్చు’ రాజుకుంటోంది. తనకు కనీస సమాచారం లేకుండా స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రెండోరోజు మంగళవారం కూడా అలక వీడలేదు. సోమవారం జగిత్యాలలో ఉన్న జీవన్ రెడ్డిని మంత్రి శ్రీధర్ బాబు, విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కలిసి బుజ్జగించారు. అయినా వెనక్కి తగ్గని జీవన్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, ఆ లేఖను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని చైర్మన్ కు ఫోన్ ద్వారా జీవన్ రెడ్డి సమాచారం ఇచ్చారు. కానీ చైర్మన్ నల్గొండ జిల్లా టూర్ లో ఉండడంతో బుధవారం రాజీనామా లేఖ ఇవ్వాలని జీవన్‌రెడ్డి డిసైడ్ అయ్యారు.
జీవన్‌రెడ్డి నివాసానికి భట్టి, శ్రీధర్‌బాబు
జీవన్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమైన విషయం తెలుసుకొని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు బేగంపేట్ ప్రకాశ్ నగర్ లోని ఆయన ఇంటికి వెళ్లారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన రాష్ట్ర ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆ జిల్లా ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్ సింగ్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, తదితరులు వెంట ఉన్నారు. సుమారు రెండు గంటల పాటు భట్టి, శ్రీధర్ బాబు.. జీవన్ రెడ్డితో మాట్లాడారు. ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ జీవన్ రెడ్డి అలకవీడలేదు. ఇదే సమయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షి ఢిల్లీనుంచి ఫోన్ లో జీవన్ రెడ్డితో మాట్లాడారు. పార్టీలో తగిన గౌరవం ఉంటుందని, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని చెప్పారు. ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి రాజీనామా చేస్తున్నారనే విషయం తెలిసి జగిత్యాల నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ లోని జీవన్ రెడ్డి నివాసానికి తరలివచ్చారు. చివరకు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో భట్టి, జీవన్ రెడ్డి కలిసి ఇంట్లో నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు.
జీవన్‌రెడ్డి మాకు మార్గదర్శకుడు: భట్టి
‘జీవన్ రెడ్డి చట్టసభల్లో సీనియర్ నాయకుడు. మాకు మార్గదర్శకుడు. ఆయన మనస్తాపం చెందారని తెలిసి మేం ఇక్కడికి వచ్చాం. ఆయన చెప్పిన విషయాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తాం. హైకమాండ్ పెద్దలు కూడా జీవన్ రెడ్డితో మాట్లాడుతున్నారు’ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పదేండ్లు కాంగ్రెస్ కష్ట కాలంలో ఉన్న సమయంలో పార్టీ జెండాను భుజాన మోస్తూ.. పార్టీ భావజాలాన్ని చట్ట సభల్లో వినిపించిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి అని కొనియాడారు. జీవన్ రెడ్డి సలహాలు, సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమని పేర్కొన్నారు. సీనియర్లకు కాంగ్రెస్ లో ఎలాంటి అన్యాయం జరగదని, తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని జీవన్ రెడ్డిని కోరామని భట్టి చెప్పారు. కాంగ్రెస్ లో సీనియర్ల గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా చూస్తామని, జీవన్ రెడ్డి సేవలను కాంగ్రెస్ అన్ని విధాలుగా వాడుకుంటుందని తెలిపారు. సీనియర్లను వదులుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌లో ఉంటా.. కానీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా: జీవన్‌రెడ్డి
మండలి చైర్మన్ అందుబాటులో లేరని, ఆయన అందుబాటులోకి రాగానే తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే మండలి చైర్మన్ వద్దకు వెళ్తానని, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. అయితే తాను మాత్రం కాంగ్రెస్ లోనే ఉంటానని తెలిపారు. తనకు ఆత్మాభిమానం ముఖ్యమని పేర్కొన్నారు. తనది కాంగ్రెస్ తో 40 ఏళ్ల అనుబంధమని తెలిపారు. ఇటీవల జరిగిన పరిస్థితులు తనకు తీవ్ర బాధను కలిగించాయని చెప్పారు. మండలి చైర్మన్ సమయాన్ని తాను అడిగానంటే, తన పరిస్థితిని ఒక్కసారి అర్థం చేసుకోవాలని అన్నారు. తన అవసరం అప్పుడు పార్టీకి ఉండేదని, ఇప్పుడు లేదేమో అనుకుంటున్నానని చెప్పారు. అప్పుడు తాను ఒక్కడినే మండలిలో ఉన్నానని, ఇప్పుడు మహేశ్‌కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్, గవర్నర్ కోటాలో మరి కొందరు ఎమ్మెల్సీలు రానున్నారని తెలిపారు. తనకు ఓటు వేసి మండలికి పంపించిన నిరుద్యోగులు, విద్యార్థుల తరఫున ఎప్పటికీ పోరాటం చేస్తానని చెప్పారు. ఎమ్మెల్సీగా పదవిలో ఉన్నా.. లేకపోయినా ప్రజల తరఫున పనిచేస్తానని తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై పాంచ్ న్యాయ్ లో పొందుపరిచారని, ఈ విషయంలో రాహుల్ గాంధీ అభిప్రాయం, తనది ఒక్కటేనని తెలిపారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రాజీవ్ గాంధీ తీసుకు వచ్చిన విషయాన్ని జీవన్‌రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
జగిత్యాల ఇష్యూతో కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్
జగిత్యాల ఇష్యూతో కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయింది. ఇక నుంచి చేరికల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పీసీసీ నాయకత్వాన్ని ఢిల్లీ పెద్దలు ఆదేశించారు. చేరికలతో పార్టీకి బలం పెరగాలి తప్ప, కొత్త సమస్యలు రావద్దని రాష్ట్ర నేతలకు సూచించారు. జీవన్ రెడ్డిని బుజ్జగించి సమస్యకు వెంటనే ముగింపు పలకాలని ఆదేశించారు. ఇక ముందు చేరికల సమయంలో సంబంధిత నియోజకవర్గాల నేతలకు సమాచారం ఇవ్వాలని అధిష్టానం సూచించినట్టు సమాచారం. అలాగే, చేరికలపై పీసీసీ నాయకత్వానికి హై కమాండ్ దిశా నిర్దేశం చేసినట్టు తెలిసింది.