మల్కాజిగిరి/ఉప్పల్/ఎల్బీనగర్, వెలుగు: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మంగళవారం ఉప్పల్ నియోజకవర్గంలో రూ.115.85 కోట్ల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతలతో కలిసి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప్పల్‌లో ఇప్పటికే వందల కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. నల్ల చెరువును రూ.20 కోట్లతో సుందరీకరణ చేయడంతో పాటు, సుమారు రూ.30 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ.45 కోట్లతో చేపట్టనున్న పనులకు మధుయాష్కి గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఉప్పల్ నల్ల చెరువు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి, స్వర్ణరాజు శివమణి, బొంతు శ్రీదేవి
పాల్గొన్నారు.
