మళ్లీ వస్తా.. అన్నీ బాగుంటేనే నిధులిస్తా: ఎర్రబెల్లి

మళ్లీ వస్తా.. అన్నీ బాగుంటేనే నిధులిస్తా: ఎర్రబెల్లి

ఇబ్రహీంపట్నం: 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయకుండా కొనసాగించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో మంత్రి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హారితహారం, బతుకమ్మ చీరల పంపిణీ, స్వయం సహాయక సంఘాలకు చెక్కుల పంపిణీ, 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక  గ్రామసభల్లో  ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎర్రబెల్లి మాట్లాడుతూ.. 30 రోజుల ప్రణాళికలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం ద్వారా చెత్తాచెదారాన్ని తొలగించడం ద్వారా గ్రామాలు పరిశుభ్రంగా మారుతున్నాయని, డంపింగ్ యార్డ్  ఏర్పాటు చేసి తడి చెత్త పొడి చెత్త సేకరించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకపోతే ఎవరినైనా సరే శిక్షిస్తామని ఆయన అన్నారు.

రోడ్డుపై చెత్త వేసిన వారి నుండి 500, బహిరంగ మలవిసర్జన చేసిన వారి నుండి  1000 రూపాయలు, చెట్లను నరికిన వారి నుంచి రూ.3000 వేల చొప్పున పన్నులు వసూలు చేయాలని గ్రామ పంచాయతీలకు సూచించారు. మీ పరిసరాలు శుభ్రంగా ఉన్నాయో లేదో చూసేందుకు మళ్లీ వస్తానని, అన్ని బాగుంటేనే శంకుస్థాపన చేసిన పనులకు నిధులు ఇస్తానని మంత్రి అన్నారు.

వ్యవసాయ రంగానికి మార్గదర్శకంగా నిలిచి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత కేసీఆర్​కే దక్కిందన్నారు. గతంలో ఏడు గంటల కరెంటు కోసం ఎదురు చూసే పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వంతో మారిందని మంత్రి అన్నారు. ప్రతిపక్షాలు మాత్రం 24 గంటల ఇస్తే వద్దంటున్నారని ఆయన అన్నారు. గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో కేవలం ఆరుట్ల గ్రామం లోని రెండు కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేసుకున్నామని మరో కోటి యాభై లక్షల రూపాయల వరకు అందజేసేందుకు కు ప్రభుత్వం సిద్ధంగా ఉందని దయాకర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జడ్పీచైర్​ పర్సన్​ తీగల అనితా రెడ్డి, తదితరులు పాల్గోన్నారు.

Minister Errabelli Dayakar Rao participated in the 30-day action plan in Aarutla village