అగ్నిపథ్ స్కీం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు

అగ్నిపథ్ స్కీం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు
  • సికింద్రాబాద్ ఘ‌ట‌న‌పై మంత్రి ఎర్రబెల్లి  విచారం
  • నిరుద్యోగుల ప‌ట్ల కేంద్ర వైఖ‌రిపై ఆగ్రహం
  • ఇంటర్ సర్టిఫికెట్ ఇచ్చి ఇంటికి పొమ్మంటారా?
  • క్షతగాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశం
  • వెంట‌నే కేంద్రం ఎక్స్ గ్రేషియా చెల్లించాల‌ని డిమాండ్‌
  • సంయ‌మ‌నం పాటించాల‌ని  నిరుద్యోగులకు పిలుపు

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ ఘ‌ట‌న దుర దృష్టకరమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అగ్నిపథ్ స్కీంను వెనక్కు తీసుకోవాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ లో ఆర్మీ అభ్యర్థుల చేపట్టిన ఆందోళనలో వ‌రంగ‌ల్ జిల్లా ఖానాపురం మండ‌లం ద‌బీర్‌పేట‌కు చెందిన రాకేశ్ మృతి చెందాడు. ఈ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు.  మృతుడి కుటుంబానికి అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అగ్నిపథ్ స్కీం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని మంత్రి స్పష్టం చేశారు. దేశ స్థాయిలో కేవ‌లం 46 వేల మందిని తీసుకోవ‌డానికి ఇంత పెద్ధ రాద్ధాంతం అవ‌స‌ర‌మా? అవసరమా అని ప్రశ్నించారు. 

10వ త‌ర‌గ‌తి పాసైన అభ్యర్థులను తీసుకొని నాలుగేళ్ల తర్వాత పర్మనెంట్ కాకపోతే... ఇంటర్ సర్టిఫికెట్ ఇచ్చి ఇంటికి పంపుతామని కేంద్రం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మొన్న నల్ల  చట్టాలతో రైతులు, ఇవాళ అగ్నిపథ్ స్కీంతో యువతను కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని మంత్రి మండిపడ్డారు. అగ్నిపథ్ స్కీంతో నిరాశకు గురైన యువత ఆగ్రహంతో ఆందోళన చేస్తోంటే... దాని వెనుక ప్రతి పక్ష పార్టీల కుట్ర ఉందని బీజేపీ నాయకులు చెప్పడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. దేశ వ్యాప్తంగా జ‌రుగుతున్న అన్ని ఆందోళ‌న‌ల వెనుక పార్టీలే ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. ఇది బీజేపీ చేతకాని తనానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు.  రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి... సంయమనం పాటించాలని ఆర్మీ అభ్యర్థులను కోరారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే కేంద్ర వైఖరికి నిరసనగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు.