ధరలు పెంచే బీజేపీ కావాలా? ఆదుకునే టీఆర్ఎస్ కావాలా?

V6 Velugu Posted on Sep 09, 2021

కరీంనగర్: ‘కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నెల నెలకు గ్యాస్ ధర పెంచి సబ్సిడీ తగ్గిస్తుంది. నిత్యావసర ధరలు పెంచి పేద ప్రజల మీద భారం వేస్తుంది. ధరలు పెంచే బీజేపీ కావాలా? పేద ప్రజలను ఆదుకునే టీఆర్ఎస్ కావాలా? అలోచించండి’ అని మంత్రి హరీష్ రావు హుజురాబాద్ ప్రజలను ప్రశ్నించారు. హుజూరాబాద్ పట్టణంలోని రంగనాయకుల గుట్ట వద్ద పాటిమిది ఆంజనేయ స్వామి జ్ఞాన సరస్వతి దేవాలయంలో మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దమ్మ గుడి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావుతో మంత్రి గంగుల కమలాకర్, హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.

‘పెద్దమ్మ గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషం. వచ్చే ఆరు నెలల్లో గుడి పూర్తి చేసుకొని బోనాలు సమర్పించుకుందాం. ఇక్కడ ఇన్ని దేవాలయాలు ఉన్నా.. రోడ్డు ఉండకపోవడం సరైంది కాదు. చిలుక వాగు బ్రిడ్జి కోసం కోటి రూపాయలు మంజూరు చేసినం. టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. 30 లక్షల రూపాయలతో దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతం. గతంలో ఇక్కడ ఉన్న మంత్రి ఒక్క డబుల్ బెడ్ రూం కూడా కట్టలేదు. హుజూరాబాద్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు వేల ఇండ్లు ఇచ్చినా.. మంత్రి మాత్రం ఒక్క ఇల్లు కట్టలేదు. స్థలం ఉన్న వారికి డబ్బులు ఇచ్చి.. ఇల్లు కట్టించే బాధ్యత నేనే తీసుకుంట. ఒక్క ఇల్లు కూడా కట్టని ఈటల రాజేందర్‎కు ఓటు వేస్తే ఎలా అభివృద్ది చేస్తాడు. అభివృద్ది కావాలంటే గెల్లు శ్రీనివాస్‎కు ఓటు వేసి గెలిపించండి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నెల నెలకు గ్యాస్ ధర పెంచి సబ్సిడీ తగ్గిస్తుంది. నిత్యావసర ధరలు పెంచి పేద ప్రజల మీద భారం వేస్తుంది. ధరలు పెంచే బీజేపీ కావాలా? పేద ప్రజలను ఆదుకునే టీఆర్ఎస్ కావాలా? అలోచించండి. ఇంకా రెండేళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుంది. కరోనా సమయంలో పేద ప్రజలను ఆదుకున్నం. సెంటిమెంట్లు కడుపు నిండదు. పని చేసే వాళ్ళను ఆదరించాలి’ అని మంత్రి హరీష్ రావు అన్నారు.

Tagged Bjp, TRS, Telangana, CM KCR, Eatala Rajender, Minister Harishrao, Huzurabad, , Huzurabad By election, Gellu Srinivas

Latest Videos

Subscribe Now

More News