తమిళిసై ట్వీట్ పై స్పందించిన మంత్రి హరీష్ రావు

తమిళిసై ట్వీట్ పై స్పందించిన మంత్రి హరీష్ రావు

ఉస్మానియా ఆస్పత్రిపై గవర్నర్ తమిళి సై చేసిన ట్వీట్ పై మంత్రి హరీష్ రావు స్పందించారు. గవర్నర్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని ఆయన అన్నారు. తెలంగాణ వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి సాధించాం.. ఈ అభివృద్ధి గవర్నర్ కు కనిపించలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కోసం ఎన్ని మంచి పనులు చేసినా గవర్నర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. తెలంగాణలో మాతృ,శిశు మరణాలు తగ్గుతున్నాయి మరి దీనిగురించి ఏం మాట్లాడారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై బురద చల్లుతున్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ధిపై గవర్నర్ ఒక్కసారైనా మాట్లాడారా అని నిలదీశారు. కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్టు ఉంది గవర్నర్ శైలి అని వ్యాఖ్యానించారు. ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితిపై  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విట్టర్ వేదికగా జూన్ 28  బుధవారం ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రిపై ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆమె  కోరారు. 

గాంధీ ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రుల్లో అవయవాల మార్పిడి విజయవంతం అవుతుందని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఉస్మానియా ఆస్పత్రిలో 2019 సంవత్సరంలో ఓపీ 12 లక్షలు ఉండేది. కానీ బస్తీ దవాఖానాలు అందుబాటులోకి రావడంతో 5 లక్షల ఓపీకి బర్డెన్ తగ్గిందన్నారు. ప్రపంచమే అబ్బురపడే విధంగా తెలంగాణలో కంటివెలుగు పథకాన్ని ప్రవేశపెట్టామని మంత్రి హరీష్ రావు తెలిపారు. మెరుగైన ఆరోగ్య తెలంగాణ కోసం ఆరోగ్యశాఖ పని చేస్తోందని పేర్కొన్నారు. వర్ష కాలం ప్రారంభం అవ్వడంతోనే సీజనల్ వ్యాధులపై జిల్లా వ్యాప్తంగా రివ్యూ కండక్ట్ చేస్తున్నామని చెప్పారు. సింగిల్ యూస్ డైలసిస్ విభాగంలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందని పేర్కొన్నారు. ఇలాంటి మంచి పనులు చేస్తే.. గవర్నర్ ఏ రోజు ఒక ట్వీట్ కూడా చేయాలేరని అన్నారు. మంచి కనబడదు, మంచి వినబడదు, మంచి మాట్లాడకూడదు అన్నటు గవర్నర్ వ్యవహారిస్తున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. 

ఏం ట్వీట్ చేశారంటే..

దశాబ్ధాల చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రి ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆందోళనకరంగా ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని గవర్నర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని గవర్నర్ తమిళిసై కోరారు. జస్టిస్ ఫర్ ఓజీహెచ్ పేరుతో ఉన్న ఓ ట్విటర్ ఖాతాలో ఆమె పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో ఆసుపత్రిలో రోగులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించిన ఫోటోలను ట్వీట్ లో జోడించారు. దీనితో పాటు కొత్త భవన నిర్మాణానికి జాయింట్ అసోసియేషన్ విడుదల చేసిన లేఖకు సంబంధించిన ఫోటోలను కూడా గవర్నర్ ట్వీట్ కు జత చేశారు. ఎంతో మందికి అత్యంత మెరుగైన వైద్య సేవలు అందించిన చరిత్ర ఉస్మానియా ఆసుత్రికి దక్కిందని అన్నారు. జస్టిస్ ఫర్ ఓజీహెచ్ చేసిన ట్వీట్ ను గవర్నర్ తమిళిసై రీట్వీట్ చేస్తూ.. ఆసుపత్రి దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని త్వరగా చేపట్టాటని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.