నిజాలు చెప్తే మంత్రి రుసరుస

నిజాలు చెప్తే మంత్రి రుసరుస

‘కాళేశ్వరం’ నీళ్లపై వాస్తవాలు బయటపెట్టిన ‘వీ6- వెలుగు’

అసహనంతో మాట్లాడిన మంత్రి కొప్పుల ఈశ్వర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద సాగుపై నిజాలు చెప్పిన ‘వీ6 –వెలుగు’పై మంత్రి కొప్పుల ఈశ్వర్ రుసరుసలాడారు. ‘కాళేశ్వరం నీళ్లెక్కడ’ అనే హెడ్డింగ్ తో శుక్రవారం ప్రచురించిన స్టోరీ పై అసహనం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. ‘‘వెలుగు అనే పత్రికలో వచ్చిన ఆర్టికల్ ఎంత దుర్మార్గం అంటే.. ఇలా తప్పుడు ఆరోపణలు చేయకూడదు. వాస్తవం చెప్పాలంటే ఇక్కడుండే మీ మిడ్ మానేరుకు నీళ్లు ఎక్కడియ్..? మిగతా రిజర్వాయర్లకు ఎక్కడి నుంచి వస్తున్నయ్.. ? ప్రత్యక్ష సాక్షి కలెక్టర్ ఉన్నడు. గత యాసంగి పంటకు ఈసారి యాసంగి పంటకు చూసుకుంటే లక్షా 22 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఏడికెళ్లి వచ్చింది? ఆకాశంల నుంచి ఊడిపడ్డదా.. దానంతట అదే వచ్చిందా..? ఐదేండ్ల కింద ఎందుకో రాలే.. ఇప్పుడెందుకో వస్తాంది. ఇవన్నీ మన కండ్ల ముందే కనబడుతున్నయ్.. దేశానికే ఆదర్శంగా ఉన్న రాష్ట్రాన్ని పట్టుకొని మాట్లడటం కరెక్ట్ కాదు. వాస్తవాలు చెప్తే ప్రజలు సంతోషిస్తరు. ఈరోజు తెలంగాణ ఒక ఫిష్ హబ్ గా మారింది. ఏ ఊళ్లె చూసినా చాపలే. గతంలో ఆంధ్రా ప్రాంతం నుంచి హైదరాబాద్ కు చాపలు వస్తే.. అక్కడి నుంచి కరీంనగర్ కు వస్తే ఆ చాపలను మనం తినేది. లేకపోతేచెరువుల చాపలు పట్టిన ఒక్కరోజో, రెండు రోజులో చాపలు తినే పరిస్థితి..’’ అని అన్నారు .

వీ6- వెలుగు ఏం చెప్పింది..

కొప్పుల ప్రస్తావించిన మిడ్ మానేరు రిజర్వాయర్ సహా ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుల కిందనే ఈ వానాకాలం సీజన్ లో 41 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నారని ‘వీ6– వెలుగు’ శుక్రవారం ప్రముఖంగా ప్రచురించింది. ఇరిగేషన్ శాఖ అధికారికంగా రూపొందించిన నివేదికలోని ఆయకట్టు వివరాలనే ప్రస్తావించింది. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఒక్క ఎకరానికీ నీళ్లు ఇవ్వలేదనే నిజాన్ని బయటపెట్టింది. అయినా ప్రభుత్వం ఆ ప్రాజెక్టు నుంచే కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తున్నట్లు చెప్తూ ప్రజలను మభ్య పెడుతోందని ఎండగట్టింది. నిరుడు వానాకాలంలోనే కాళేశ్వరంను అధికారికంగా ప్రారంభించినా ప్రతిపాదించిన ఆయకట్టులో ఒక్క ఎకరాకూ నీళ్లు ఇవ్వలేకపోయిందని కుండ బద్దలు కొట్టింది. ప్రాజెక్టుల కింద మొత్తానికి మొత్తం సాగయ్యే భూమి అంతా ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన రిజర్వాయర్ల కిందిదేనని తెలియజెప్పింది.