ఉద్యోగుల జీతాలే ఆగుతున్నయ్..గొర్లెట్ల కొనియ్యాలె?

ఉద్యోగుల జీతాలే ఆగుతున్నయ్..గొర్లెట్ల కొనియ్యాలె?
  • సర్కారు ఆమ్దానీ పడిపోయింది
  • ఇప్పటికే డిపార్ట్​మెంట్లకు కేటాయింపులు ఆగినయ్​
  • సన్న వడ్లకు బోనస్​పైసీఎం నుంచి క్లారిటీ రాలేదు
  • నిర్మల్​ జడ్పీ మీటింగ్​లో మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి

నిర్మల్‍, వెలుగు: ‘‘ప్రభుత్వ ఉద్యోగుల జీతాలే ఆగుతన్నయ్​.. ఇంక గొర్లు కొనియ్యాలంటే ఎట్ల?’’ అని గొర్ల పంపిణీ గురించి అడిగిన జడ్పీటీసీ మెంబర్లపై మంత్రి  ఇంద్రకరణ్‍రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కరోనాకు ముందు రాష్ట్రానికి ప్రతి నెలా రూ. 15 వేల కోట్ల చొప్పున ఇన్​కం వచ్చేదని,  ఏప్రిల్, మే నెలల్లో కలిపి రూ. 1,500 కోట్లు కూడా రాలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్నీ కావాలంటే ఎట్ల? అని ప్రశ్నించారు. నిర్మల్​లోని ఓ ఫంక్షన్‍హాల్‍లో సోమవారం జడ్పీ చైర్‍పర్సన్‍ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన జడ్పీ మీటింగ్​కు మంత్రి ఇంద్రకరణ్‍రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు జడ్పీటీసీ మెంబర్స్​ వివిధ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. జిల్లావ్యాప్తంగా గొర్ల కాపరులు డీడీలు తీసి, గొర్రెల కోసం ఎదురుచూస్తున్నారని, మొదటి విడత గొర్రెలే ఇంకా రాలేదని, రెండో విడత ఎప్పుడిస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారని చెప్పారు.

దీనికి స్పందించిన మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి.. ప్రభుత్వ ఆదాయం పడిపోయిందని,  ప్రభుత్వ ఉద్యోగుల జీతాలే ఆగుతుంటే గొర్లు కొనియ్యాలంటే ఎట్ల అని ఎదురు ప్రశ్నించారు. ప్రస్తుతానికి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని, పెట్టుబడి సాయం, విత్తనాలు, ఫెర్టిలైజర్స్​ అందిస్తున్నామని తెలిపారు. దీంతో వేరే డిపార్ట్​మెంట్లకు కేటాయింపులు ఆగాయని చెప్పారు. సన్న రకం వడ్లకు రూ. 150 చొప్పున అదనంగా బోనస్​ ఇస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని మంత్రి దృష్టికి ఓ జడ్పీటీసీ తీసుకురాగా.. దానిపై సీఎం నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ లేదని ఆయన చెప్పారు. సన్న రకానికి ఇన్సెంటివ్​ ఇస్తే ఎఫ్​సీఐ కొనుగోలు చేయదని ఇంద్రకరణ్​రెడ్డి వ్యాఖ్యానించారు.