హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక ప్రాజెక్టులను వేగవంతం చేస్తామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో భాగంగా పారిశ్రామికవేత్తలకు అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో గల నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్(నిథమ్) ప్రాంగణంలో శనివారం డెస్టినేషన్ తెలంగాణ – రోడ్ అహెడ్ పేరిట నిర్వహించిన పర్యాటక సదస్సుకు ఆయన చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతిపాదనలతోపాటు డీపీఆర్ సమర్పిస్తే, జాప్యం లేకుండా అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు.
ఎంపికైన సంస్థలకు డిజైన్లు, ప్రాజెక్ట్ అంచనాల వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. కొన్ని పర్యాటక ప్రాంతాల్లో వసతుల ఏర్పాటుకు ప్రైవేట్ వ్యక్తులు ముందుకు రావాలని, వారికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు.
పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, టీజీటీడీసీ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రజింత్ నాయక్, నిథమ్ డైరెక్టర్ వెంకటరమణ, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.
