హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో రామరాజ్య స్థాపనే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు.. 2026 ఏడాదికిగాను తెలంగాణలోని గ్రామాల బలోపేతానికి ఇప్పటివరకు కేంద్రం మొత్తం రూ. 1,034.42 కోట్లను విడుదల చేసినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
ఫిబ్రవరి 5న తొలి విడతగా రూ. 259.36 కోట్లు, ఆ తర్వాత రెండో విడతగా రూ. 387.1 కోట్లు, తాజాగా మూడో విడత కింద రూ. 387.96 కోట్లు విడుదల చేసిందని వివరించారు. మొత్తం రూ.1,034.42 కోట్లు రాష్ట్రానికి అందాయని..ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంచాయతీలకు బదిలీ చేసి, కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు, వార్డు మెంబర్లలో విశ్వాసం నింపాలన్నారు.
ఇప్పటివరకు ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన యూటిలైజేషన్ సర్టిఫికేట్లను కేంద్రానికి సమర్పిస్తే.. మిగిలిన రూ. 2,000 కోట్లను కూడా వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. మోదీ హయాంలో గత పదేండ్లలో రాష్ట్ర పంచాయతీలకు రూ. 11,000 కోట్లకు పైగా నిధులు ఇచ్చామని గుర్తుచేశారు.
వడ్డీతో సహా కట్టాల్సిందే..
కేంద్రం నుంచి నిధులు అందిన 10 పని దినాల్లోపు ఎటువంటి కోతలు లేకుండా నేరుగా పంచాయతీల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయాలని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ 10 రోజులు దాటితే, రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ రుణాలపై చెల్లించే వడ్డీ రేటు ప్రకారం.. అసలుతో పాటు వడ్డీని కూడా కలిపి పంచాయతీలకు చెల్లించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ప్రతి పంచాయతీ పీఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా ప్రత్యేక ఖాతాలను నిర్వహించాలని సూచించారు
.గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. పంచాయతీల ఖాతాలను ఫ్రీజ్ చేయడం వల్ల సర్పంచ్‌లు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, చేసిన పనులకు బిల్లులు రాక అప్పుల పాలై కొందరు సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకోవడం ఆవేదన కలిగించిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ తప్పులు పునరావృతం చేయకుండా నిధులను నేరుగా గ్రామాలకు చేరవేయాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
