కేటీఆర్.. నీ దుకాణం బంద్ అయింది: వెంకట్ రెడ్డి

కేటీఆర్.. నీ దుకాణం బంద్ అయింది: వెంకట్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కేటీఆర్.. దుకాణం ఇక బంద్ అయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రతిపక్షం కాదు.. ఫ్రస్ట్రేషన్ పక్షమని కామెంట్ చేశారు. ‘‘వాళ్లకు అధికారం పోయింది. ‘నేనే సీఎం అయితే’  అంటూ హరీశ్ రావు అంటున్నారు. వీరిని ఏం చేయలేం. వీరిని దేవుడు కూడా కాపాడలేడు’’ అని విమర్శించారు. గురువారం అసెంబ్లీలో కోమటిరెడ్డి మాట్లాడారు. మేనిఫెస్టోలో హామీలిచ్చి మోసం చేయడం బీఆర్ఎస్ కు అలవాటు అని, కానీ తాము అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే హామీల అమలు ప్రారంభించామని తెలిపారు. ‘‘రాకరాక నల్లగొండకు వచ్చారు. ఒక హోంగార్డును పొట్టనపెట్టుకున్నారు. మస్తీ ఎక్కి హైదరాబాద్​లో దోచుకున్న పైసలతో ర్యాలీ తీసుకొచ్చారు.

హోంగార్డు చనిపోతే కనీసం ఆ జిల్లా ఎమ్మెల్యే గానీ, కేటీఆర్, కేసీఆర్ గానీ ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పలేదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కేసీఆర్ 2001లో పార్టీ పెట్టిండు. ఈ రాష్ర్టానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పారు. ఆ మాట అమలు కాకుంటే తల తీసుకుంటా అని అన్నారు. మరి తల ఉందా కేసీఆర్ కు? దళితుడిని ముఖ్యమంత్రిని చేసిండా?” అని ప్రశ్నించారు. దళితుడైన భట్టి విక్రమార్క ప్రతిపక్ష నాయకుడైతే, కేసీఆర్ ఓర్వలేక 13 మంది ఎమ్మెల్యేలను అంగట్లో పశువులను కొన్నట్టు కొన్నాడని మండిపడ్డారు. 

అవేం మాటలు: కడియం 

ఒక మంత్రి సభలో ‘మస్తీ ఎక్కి’ అంటూ మాట్లాడుతారా? అని కడియం శ్రీహరి మండిపడ్డారు. ‘‘నేను, సీఎం రేవంత్ ఒకే స్కూళ్లో చదివాం. ఆయన నాకు జూనియర్. రేవంత్ సీఎంగా ఉండాలని నా మనసునిండా ఉంది. రేవంత్.. కొంచెం మీ వాళ్లతో జాగ్రత్తతో ఉండండి. ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు. మావైపు నుంచి ఎలాంటి ప్రమాదం ఉండదు. మీరేం వర్రీ కాకండి. మీ వాళ్లను జెర జాగ్రత్తగా చూసుకోండి’’ అని అన్నారు.

కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచేలా హరీశ్​వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే తాను సీఎం అవుతానంటూ బీఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి స్పందించారు. హరీశ్​రావు కామెంట్స్​ కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచే విధంగా ఉన్నాయని, సీఎం అయ్యేందుకు ఆయన​ప్లాన్​ చేసుకుంటున్నట్టుందని అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీ లాబీలో  మీడియాతో చిట్ చాట్ చేశారు.

కేసీఆర్ ను వ్యతిరేకించి హరీశ్​రావు బయటకు వస్తే తాము మద్దతిస్తామని, ఆ పార్టీ కవిత, హరీశ్,​ కేటీఆర్ పేర్ల మీద విడిపోతుందని, చివరకు బీఆర్ ఎస్ నాలుగు ముక్కలవుతుందని ఆయన జోస్యం చెప్పారు. బీఆర్​ఎస్ లో ఉంటే హరీశ్​రావు సీఎం కాలేడని, బీఆర్ ఎల్పీ లీడర్ కూడా కాలేరన్నారు. కట్టె పట్టుకొని తిరుగుతున్న కేసీఆర్​ను పులి అంటున్నారని, 60 కిలోలు ఉన్న వ్యక్తి పులి అయితే 86 కిలోలు ఉన్న నేనేం కావాలన్నారు. ఇంకో 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందన్నారు.