గాంధీ ఆస్పత్రి చూసి మంత్రి విస్మయం.. మరమ్మతులు చేస్తామని వెల్లడి

గాంధీ ఆస్పత్రి చూసి మంత్రి విస్మయం.. మరమ్మతులు చేస్తామని వెల్లడి

పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్‌‌‌‌లో కంటోన్మెంట్‌‌‌‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతదేహానికి నివాళులర్పించిన అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌ రెడ్డి ఆస్పత్రిని సందర్శించారు. అక్కడి పరిస్థితులను చూసి విస్మయం వ్యక్తం చేశారు. బిల్డింగ్‌‌‌‌లో పలు చోట్ల వాటర్‌‌‌‌‌‌‌‌ లీకేజీ అవుతుండటం, అపరిశుభ్ర వాతావరణం చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం హాస్పిటల్‌‌‌‌ కాన్ఫరెన్స్‌‌‌‌ హాల్‌‌‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గాంధీలో సూపరింటెండెంట్‌‌‌‌ చాంబర్‌‌‌‌‌‌‌‌, కాన్ఫరెన్స్ హాల్‌‌‌‌ తప్ప.. మిగతా చోట్ల వాటర్‌‌‌‌‌‌‌‌ లీకేజీలు, అపరిశుభ్రమైన పరిస్థితి ఉందన్నారు. వీటికి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉం దని చెప్పారు.

ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌‌‌‌ రాజారావును అడగ్గా.. రూ.14.54 కోట్లు కేటాయిస్తే లీకేజీలు, డ్రైనేజీల సమస్య తీరుతుందని తెలిపారు. దీనికి సంబంధించి గతేడాది నుం చి ఆరుసార్లు టెండర్లు పిలిచినా.. కాంట్రాక్టర్లు ముందుకు రాలేదన్నారు. అనంతరం అక్కడే టీఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులకు ఫోన్‌‌‌‌ చేసిన మంత్రి.. వెంటనే గాంధీ హాస్పిటల్‌‌‌‌కి వచ్చి చేయాల్సిన మరమ్మతు పనులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

గాంధీ ఆస్పత్రిలో మౌలిక వసతుల కల్పనపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి, త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు, ఉస్మానియా ఆస్పత్రికి కొత్త బిల్డింగ్ నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. కాగా, మధ్యాహ్నం గాంధీ ఆస్పత్రికి చేరుకున్న టీఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులు.. గాంధీలో చేయాల్సిన డ్రైనేజీ లీకేజీలు, తదితర పనులను సూపరింటెండెంట్ రాజారావును అడిగి తెలుసుకున్నారు.