- ఎన్నికల ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- 48 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ఎక్కువ నిధులు తీసుకొస్తా
నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా చేసి తీరుతానని గురువారం మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా నల్గొండ పట్టణంలోనీ పలు డివిజన్లలో ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకులనే కాంగ్రెస్ అభ్యర్థులుగా నిలిపిందన్నారు. 48 డివిజన్లలో కాంగ్రెస్ కార్పొరేటర్లు గెలిస్తే సీఎం రేవంత్ రెడ్డిని అడిగి నల్గొండకు ఎక్కువ నిధులు తెస్తానన్నారు. 2 వేల కోట్ల పైగా నిధులతో నల్గొండ పట్టణాన్ని అభివృద్ధి చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నల్గొండ ప్రచారానికి వస్తే ఆంజనేయస్వామిని దర్శించుకుని పోవాలని సూచిస్తున్నానని, ఆయన ఎవరి ప్రచారం కోసం వస్తున్నారో తనకు తెలియదన్నారు.
1వడివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఆలకుంట్ల నాగరాజు, 2వ డివిజన్ అభ్యర్థి గురిజాల నరేందర్,3వ డివిజన్ అభ్యర్థి గాలి వినోద,19వ డివిజన్ గోగుల గణేష్, 18వ డివిజన్ గడిగ హిమబిందు,40వ డివిజన్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి శ్రీనివాస్,39వ అల్లి మల్లికార్జున్,38వ డివిజన్ బోయపల్లి వేదశ్రీ,37వ డివిజన్ నంద్యాల వీర బ్రహ్మానంద రెడ్డి,36వ డివిజన్ అభ్యర్థి పుట్ట వెంకన్న గౌడ్,35వ డివిజన్ ఇటికాల మంగమ్మ - శ్రీనివాస్ తరఫున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ హఫీజ్ ఖాన్, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
