V6 News

కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
  •     మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

నల్గొండ, వెలుగు:  నల్గొండ జిల్లాలో రబీ ధాన్యం సేకరణను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఇతర అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎండలు పెరుగుతున్న దృష్ట్యా రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రాలకు రాత్రింబవళ్లు లారీలు పంపాలని, అవసరమైతే అదనపు కాంటాలు, లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

నల్గొండ నియోజకవర్గంలో 2.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని, రోజూ 10 వేల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పారు. మిల్లర్లు జాప్యం చేయకుండా సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘించిన 6 మిల్లులను ఇప్పటికే సీజ్ చేశామని తెలిపారు. నల్గొండ పట్టణాన్ని హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేస్తున్నామని, ఔటర్ రింగ్ రోడ్డు, సీసీ రోడ్ల పనులను వేగవంతం చేస్తామని, వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ట్యాంకర్ల ద్వారా కృష్ణా జలాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

వడ్డెర సంక్షేమానికి,అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం -

సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న వడ్డెర కులస్తుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. నల్గొండలో జరిగిన వడ్డెర సంక్షేమ సంఘం సభలో ఆయన మాట్లాడారు. వడ్డెరుల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని, పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న వారి భవన నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో నిలిచిపోయిన వడ్డెర కాంట్రాక్టర్ల రూ. 140 కోట్ల బిల్లులను ముఖ్యమంత్రితో మాట్లాడి మంజూరు చేయించానని గుర్తుచేశారు. రాబోయే నామినేటెడ్ పదవుల్లో ఆ కులానికి ప్రాధాన్యత కల్పించేలా కృషి చేస్తానని, రాజకీయంగా వడ్డెర యువతకు తగిన స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.