
హైదరాబాద్: సెప్టెంబర్ 10 తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇవాళ(ఆగస్టు 31) ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘లిల్లీపుట్ అని కవిత జగదీశ్ రెడ్డి పరువు తీసింది. నల్లగొండకు నీళ్లు రాకుండా ఎండబెట్టిండు. కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేయాలి. కేంద్రం ఇవ్వకపోవడంతో ఇబ్బంది అవుతుంది. వరి విస్తీర్ణం పెరగడం వల్ల యూరియా వాడకం పెరిగింది. సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్ ముగుస్తుంది' అని తెలిపారు.
సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించడంతో ప్రభుత్వ ఆ దిశగా ముందుకెళ్తోంది. తెలంగాణ పంచయతీ రాజ్ చట్ట2018 సవరణ చేసిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రిజర్వేషన్ల పరిమితిపై గత ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు ప్రవేశ పెట్టింది. అసెంబ్లీ తర్వాత ప్రత్యేక జీవో తెచ్చి కులగణన ఆధారంగా తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చూస్తోంది.
నాడు ఎస్టీలకు ఇచ్చినట్టే..
ప్రస్తుతం విద్యా, ఉద్యోగాల్లో రాష్ట్రంలో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, బీసీలకు 29%, ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం చొప్పున రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 64 శాతం అమలవుతున్నాయి. గతంలో ఎస్టీల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించి గవర్నర్‌కు పంపగా.. దాన్ని రాష్ట్రపతికి పంపారు. అక్కడ ఆమోదం లభించకపోయినా నాటి బీఆర్ఎస్ప్రభుత్వం ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ జీవో ఇచ్చింది.
అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) ప్రకారం జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేలా 105వ రాజ్యాంగ సవరణ ద్వారా 342(ఎ) ఆర్టికల్‌లో మార్పు చేశారు. దీంతో రిజర్వేషన్లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే జీవోకు కేంద్రం ఆమోదం అవసరం లేదు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల పెంపు సాధ్యమైందనే వాదన కూడా ఉన్నది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ ప్రభుత్వం అలాగే చేయనుంది.