నల్గొండ, వెలుగు: మహిళలకు ఓటు హక్కు కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కృషి చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో కేంద్రంలో మహిళ బిల్లు కోసం ప్రయత్నం చేశామనిగుర్తుచేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం నల్గొండ జిల్లా, తిప్పర్తి మండల కేంద్రంలో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రు.70 లక్షల వ్యయంతో తిప్పర్తి జంక్షన్ లో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహాలను మంత్రి ఆవిష్కరించారు.
అంతేకాక రు.10.75 కోట్ల వ్యయంతో సుందరీకరించిన తిప్పర్తి జంక్షన్ ను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు పార్లమెంటులో చట్టాలు చేయకూడదని, మహిళా రిజర్వేషన్ బిల్లు చాటున డీలిమిటేషన్ బిల్లుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. మహిళా బిల్లు విషయమై రాష్ట్ర క్యాబినెట్లో ఇదివరకే చర్చించామని తెలిపారు. అవసరమైతే మరోసారి చర్చిస్తామని చెప్పారు. డీలిమిటేషన్ తో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని, దక్షిణ భారతదేశం ద్వారానే సగం జీడీపీ దేశానికి అందుతున్నదని అలాంటిది దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగకూడదని అన్నారు.
జీడీపీలో సగం కాంట్రిబ్యూట్ చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ లో అన్యాయం జరిగితే పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకిరి రమేష్, సర్పంచు రజిత, రెవెన్యూ ఆదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ,స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమేశ్, ఆర్ అండ్ బి ఎస్ ఈ శ్రీధర్ రెడ్డి పాల్గాన్నారు.

