- శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటివారే జాతిపితలు
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్గొండ, వెలుగు: తెలంగాణ కోసం 1,100 మంది అమరులయ్యారని, వారి త్యాగాల పునాదులపైనే రాష్ట్రం ఏర్పడిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆత్మబలిదానాలు చేసుకున్న శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వాళ్లు జాతిపితలు అవుతారు కానీ కేసీఆర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జాతిపితలు ఎప్పటికీ కాలేరని అన్నారు. ‘‘సకల జనుల సమ్మె చేసిన లక్షల మంది ఉద్యోగులు , కులమతాలకు అతీతంగా 4కోట్ల మంది ప్రజలు రోడ్ల మీదికి వచ్చి ఉద్యమాలు చేస్తే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు.
సోనియా గాంధీ తెలంగాణ దేవత అంటే ఒప్పుకుంటారు కానీ కేసీఆర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలను జాతిపితలు అంటే ప్రజలు ఒప్పుకోరు” అని చెప్పారు. మంగళవారం నల్గొండ కార్పొరేషన్ లోని వివిధ డివిజన్లలో వెంకట్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ కోసం నేను మంత్రి పదవి త్యాగం చేసి, 11 రోజులు తినకుండా దీక్ష చేసి సొంత పార్టీని ఎదిరించాను.
అంతమాత్రాను నేను జాతిపిత అయిపోను. తెలంగాణ చరిత్రలో నా పేరు కూడా ఉంది. కానీ ఎప్పుడూ జాతిపిత అని చెప్పుకోలేదు. 1,100 మంది విద్యార్థుల ఆత్మబలిదానాలు చూసి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే కేసీఆర్ కుటుంబానికి పదవులు వచ్చాయి. కానీ వాళ్లు ప్రజలకు కనీసం తెల్లకార్డు కూడా ఇవ్వలేదు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు తెల్ల కార్డు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఫ్రీ బస్సు, పేదోళ్లకి ఉచిత కరెంటు ఇస్తున్నాం” అని చెప్పారు.
