మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ భేటీ

మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ భేటీ
  •     సుమారు రెండు గంటల పాటు సమావేశం
  •     హాజరైన సురేఖ కూతురు సుస్మిత, పీసీసీ చీఫ్ మహేశ్
  •     నా సమస్యలు వివరించాను.. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా:  సురేఖ
  •     త్వరలోనే పరిష్కారం అవుతుంది: మహేశ్​గౌడ్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్​చార్జ్​ మీనాక్షి నటరాజన్ తో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. గురువారం సాయంత్రం హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ కు కొండా సురేఖను పిలిపించుకున్న మీనాక్షి నటరాజన్.. ఆమెతో మాట్లాడారు.  రెండు రోజుల కింద మంత్రి ఓఎస్డీ సుమంత్ తొలగింపు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై ఆరా తీశారు. 

సుమారు రెండు గంటలపాటు సమావేశం జరిగింది. ఈ భేటీలో కొండా కూతురు సుస్మిత పటేల్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. భేటీ ముగిసిన అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. ‘‘నా ఇబ్బందులను, ఆలోచనలను పార్టీ ఇన్​చార్జ్​ మీనాక్షి నటరాజన్ కు వివరించాను. కొన్ని రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు, నేను ఎదుర్కొన్న సమస్యలన్నింటిని మీనాక్షి దృష్టికి తీసుకువచ్చాను. 

నేను చెప్పాల్సింది అంతా ఆమెకు చెప్పాను. పార్టీ పెద్దలతో మాట్లాడి నా సమస్యను పరిష్కరిస్తామని మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చారు. జరిగిన సంఘటనలపై విచారణ చేసి త్వరలోనే పార్టీ నిర్ణయాన్ని వెల్లడిస్తామని మీనాక్షి నాతో అన్నారు” అని ఆమె పేర్కొన్నారు. పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా.. అందుకు కట్టుబడి ఉంటానని, వారి ఆదేశాలను పాటిస్తానని తెలిపారు. 

మంత్రి కొండా సురేఖ సమస్య సాధ్యమైనంత త్వరగానే పార్టీ హైకమాండ్ పరిష్కరిస్తుందని పీసీసీ చీఫ్​మహేశ్ గౌడ్ అన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి సమస్యను తొందర్లోనే పరిష్కరిస్తామని కొండా సురేఖకు హామీ ఇచ్చామని ఆయన తెలిపారు. పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా, వారు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా అందుకు కట్టుబడి ఉంటానని సురేఖ కూడా తమకు మాట ఇచ్చారని పేర్కొన్నారు.