కరెంట్ వాడకంపై ఇన్ఫోసిస్ ఆరా.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న టెక్కీల డేటా కలెక్షన్

కరెంట్ వాడకంపై ఇన్ఫోసిస్ ఆరా.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న టెక్కీల డేటా కలెక్షన్

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన ఉద్యోగుల ఇంటి ఎలక్ట్రిసిటీ వాడకంపై ఆసక్తికరమైన సర్వేను ప్రారంభించింది. సాధారణంగా కంపెనీలు ఆఫీసులోని విద్యుత్ ఖర్చుల గురించి ఆలోచిస్తాయి. కానీ.. ఇన్ఫోసిస్ ఒకడుగు ముందుకు వేసి ఉద్యోగులు ఇంట్లో పవర్ వాడకం వివరాలను సేకరిస్తోంది. దీని వెనుక ప్రధాన కారణం కంపెనీ అనుసరిస్తున్న సుస్థిరత లక్ష్యాలు. దాదాపు 15 ఏళ్లుగా పర్యావరణ హితమైన విధానాలను పాటిస్తున్న ఇన్ఫోసిస్, ఇప్పుడు టెక్ రంగంలో కొనసాగుతున్న హైబ్రిడ్ వర్క్ విధానం వల్ల మారుతున్న పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తోంది. 

ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు ఆఫీస్ నుండి.. మిగిలిన రోజులు ఇంటి నుండి పని చేస్తున్నారు. ఉద్యోగులు ఇంట్లో ఉండి పని చేస్తున్నప్పుడు వాడే లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు, కంప్యూటర్ల వల్ల వెలువడే కర్బన ఉద్గారాలు కూడా ఇన్ఫోసిస్ మొత్తం పర్యావరణంలో భాగమేనని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘరాజ్కా స్పష్టం చేశారు. అందుకే ఈ ఉద్గారాలను ఖచ్చితంగా లెక్కించి.. వాటికి సమానమైన స్థాయిలో క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం ద్వారా కార్బన్ న్యూట్రాలిటీని కాపాడాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ALSO READ : గోల్డ్- సిల్వర్ రేట్లు పెరుగుతున్నా తగ్గేదే లే అంటున్న షాపర్స్..

ఈ సర్వేలో భాగంగా ఉద్యోగులు తమ ఇంట్లో ఏయే విద్యుత్ ఉపకరణాలు వాడుతున్నారు? ఏసీలు, హీటర్ల వినియోగం ఎంత? బల్బుల వాటేజీ ఎంత? అనే వివరాలను కోరుతోంది. అలాగే ఎవరైనా తమ ఇంట్లో సోలార్ పవర్ వాడుతున్నారా అనే సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. ఇన్ఫోసిస్ ఇప్పటికే తన విద్యుత్ అవసరాల్లో 77 శాతానికి పైగా రెన్యూవబుల్ ఎనర్జీ నుంచే పొందుతోంది. 2008 నుండి తలసరి విద్యుత్ వినియోగాన్ని 55 శాతం తగ్గించిన ఘనత ఈ సంస్థకు ఉంది.

ALSO READ : జనవరి 27న బ్యాంకుల సమ్మె..

ఉద్యోగుల్లో ఎనర్జీ సేవింగ్ గురించి అవగాహన కల్పించడం కూడా ఈ సర్వే ఉద్దేశ్యంగా తెలుస్తోంది. ఇన్ఫోసిస్ ఆఫీసులు సాధారణ భవనాల కంటే 50-60 శాతం తక్కువ విద్యుత్తును వినియోగిస్తాయి. అదే తరహాలో ఉద్యోగులు తమ ఇళ్లలో కూడా విద్యుత్ పొదుపు పాటించేలా ప్రోత్సహిస్తోంది కంపెనీ. ఈ డేటా ద్వారా కంపెనీ తన పర్యావరణ నివేదికలను మరింత ఖచ్చితంగా రూపొందించుకోవడమే కాకుండా.. భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీని మరింత సమర్థవంతంగా ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందంట. ఇన్ఫోసిస్ ఇప్పటికే కర్ణాటకలో తన అవసరాల కోసం 60 మెగావాట్ల క్యాప్టివ్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. తన క్యాంపస్ అవసరాలకు దీని ద్వారానే విద్యుత్ అందిస్తూ గ్రిడ్ పై ఆధారపడటాన్ని తగ్గించుకుంటోంది. దేశంలో ఇలాంటి ఆలోచనతో వచ్చిన ఏకైక కంపెనీగా ఇన్ఫోసిస్ నిలిచింది.