ఇండియాతో పెట్టుకుంటే అట్లే ఉంటది మరీ: ఒక్క నిర్ణయంతో బంగ్లాకు రూ.350 కోట్లు లాస్

ఇండియాతో పెట్టుకుంటే అట్లే ఉంటది మరీ: ఒక్క నిర్ణయంతో బంగ్లాకు రూ.350 కోట్లు లాస్

న్యూఢిల్లీ: ఇండియా, శ్రీలంక సంయుక్తంగా అతిథ్యమివ్వనున్న  2026 టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించింది. భద్రతా కారణాలతో ఇండియాలో ఆడలేమని చెప్పడంతో ఆ టీమ్‎ను టోర్నీ నుంచి తొలగించింది ఐసీసీ. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఇప్పటికే పీకల్లోతూ ఆర్ధిక కష్టాల్లో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పరిస్థితిని ఈ నిర్ణయం మరింత దిగజార్చనుంది. 

వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు భారీ ఆర్ధిక నష్టం వాటిళ్లనుంది. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు రూ.350 కోట్ల మేర బంగ్లాదేశ్ లాస్ కానుంది. వరల్డ్ కప్‏లో పాల్గొనే ప్రతి జట్టుకు పార్టిసిపేషన్ ఫీజు కింద ఐసీసీ 5 లక్షల యూఎస్ డాలర్లు చెల్లిస్తుంది. అయితే.. వరల్డ్ నుంచి నిష్క్రమించినందుకు బంగ్లా ఈ మొత్తాన్ని కోల్పోనుంది. దీంతో పాటు ఐసీసీ వార్షిక ఆదాయ వాటా కూడా బంగ్లాదేశ్ లాస్ అవుతోంది.

ఐసీసీ వార్షిక ఆదాయ వాటా కింద బంగ్లాదేశ్ దాదాపు USD 27 మిలియన్లు (330 కోట్లు) ఆదాయం పొందుతోంది. టోర్నీ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించడంతో ఐసీసీ ఈ వాటాను నిలిపివేస్తుంది. ఈ మొత్తం బంగ్లా బోర్డు వార్షిక బడ్జెట్‌లో దాదాపు 60 శాతం. అలాగే ఇతర వాణిజ్య ప్రకటనలో ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా బంగ్లా నష్టపోతుంది. దీంతో ఇండియాతో పెట్టుకుంటే ఇట్లే ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. 

అసలేం జరిగిందంటే..?

బంగ్లాదేశ్‎కు ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. ఇండియాలో వరల్డ్ కప్ మ్యాచులు ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్‎ను టీ20 వరల్డ్ కప్ నుంచి భర్తరఫ్ చేసింది. గ్రూప్-సీలో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‎కు అవకాశం కల్పించింది. ఈ మేరకు శనివారం (జనవరి 24) ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. 

Also Read : పిల్లకూన బంగ్లాదేశ్‎ను టీ 20 వరల్డ్ కప్ నుంచి తీసిపారేసిన ఐసీసీ

ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భద్రతా కారణాలు సాకుగా చూపి ఇండియాలో వరల్డ్ కప్ మ్యాచులు ఆడలేమంటూ బంగ్లాదేశ్ ఐసీసీకి చెప్పింది. తమ మ్యాచులను ఇండియా బయట వేదికలకు తరలించాలని లేదంటే గ్రూప్ అయినా మార్చాలని ఐసీసీని అభ్యర్థించింది. 

ఇప్పటికే వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారు కావడంతో బంగ్లా అభ్యర్థనను ఐసీసీ తోసిపుచ్చింది. ఇండియాలో ఆడాల్సిందేనని ఐసీసీ తేల్చి చెప్పింది. లేదంటే మీ ఇష్టం అంటూ జనవరి 23వ తేదీ వరకు డెడ్ లైన్ విధించింది. ఈ లోపు ఏదో ఒకటి చెప్పాలని ఆదేశించింది. బంగ్లాదేశ్ మాత్రం ఇండియాలో ఆడేందుకు ఒప్పుకోలేదు. దీంతో టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్‎ను తీసి పడేసింది ఐసీసీ. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‎కు అవకాశం కల్పించింది.

స్కాట్లాండ్ తమ నాలుగు గ్రూప్ లీగ్ మ్యాచ్‌లను వెస్టిండీస్ (ఫిబ్రవరి 7), ఇటలీ (ఫిబ్రవరి 9) మరియు ఇంగ్లాండ్ (ఫిబ్రవరి 14) లతో కోల్‌కతాలో ఆడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 17న ముంబైలో నేపాల్‌తో ఒక మ్యాచ్ ఆడుతుంది.