- పులుల కదలికలను పర్యవేక్షించేందుకు అరణ్య భవన్లో ‘టైగర్ ప్రొటెక్షన్ సెల్’ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: టెక్నాలజీని ఉపయోగించి వన్య ప్రాణులను సంరక్షించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. దేశంలోనే మొదటి సారి అరణ్య భవన్లో ఏర్పాటు చేసిన ‘టైగర్ ప్రొటెక్షన్ సెల్’ను మంగళవారం సెక్రటేరియెట్నుంచి మంత్రి ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా వన్యప్రాణి భద్రత టీమ్‌ను మంత్రి అభినందించారు. ఈ నెల 28న ఐసీసీసీలో నిర్వహించే తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి ఈ అంశాన్ని తెలియజేస్తానని చెప్పారు.
అటవీ శాఖ, జూ అధికారులు, సిబ్బంది వన్యప్రాణుల రక్షణ కోసం నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. వన్యప్రాణుల భద్రత, ప్రజల రక్షణకు కొత్తగా హైటెక్ టైగర్ మానిటరింగ్ సెల్, కమాండ్ హబ్ ఏర్పాటైందన్నారు.. హైదరాబాద్‌లోని స్టేట్ కమాండ్ సెంటర్, మన్ననూరు (అమ్రాబాద్ టైగర్ రిజర్వ్), మంచిర్యాల (కవ్వాల్ టైగర్ రిజర్వ్)లోని కొత్త రీజినల్ సెంటర్లు జత చేసినట్లు అధికారులు మంత్రికి తెలిపారు.
టైగర్ మానిటరింగ్ సెల్ అడవులను సురక్షితం చేస్తుందని, సిబ్బందికి మద్దతు ఇస్తుందని, రాష్ట్రంలో వన్యప్రాణుల భవిష్యత్తును కాపాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ, వైల్డ్‌లైఫ్ చీఫ్ వార్డెన్ ఈలు సింగ్ మేరు, డైరెక్టర్ సునీల్ తదితర అధికారులు పాల్గొన్నారు.
నెహ్రూ జూ పార్కుకు ఐఎస్ఓ సర్టిఫికేషన్
హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కుకు ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేషన్ వచ్చింది. మంగళవారం సచివాలయంలో సర్టిఫికేషన్‌ను మంత్రి కొండా సురేఖ.. నెహ్రూ జులాజికల్ క్యూరేటర్ వసంతకు అందజేశారు.
