
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ట్విట్టర్లో సారీ చెబితే సరిపోదన్నారు. మహిళలకు కేటీఆర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బ్రేక్ డ్యాన్సులకు అలవాటు పడ్డ వాళ్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని విమర్శించారు. రైతులపై బీఆర్ఎస్ ది కపట ప్రేమ అని అన్నారు.
కేటీఆర్ క్షమాపణ
బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్సులు,రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చంటూ కేటీఆర్ ఆగస్ట్ 15న వివాదాస్పద కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో ట్విట్టర్ వేదికగా సారీ చెప్పారు. ‘‘నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను.. నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు’’ అని కేటీఆర్ పోస్ట్ చేశారు.
మరో వైపు కేటీఆర్ కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. ఆగస్టు 24న కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.