మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలి : మంత్రి కొండా సురేఖ

మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలి  : మంత్రి కొండా సురేఖ
  • ప్రభుత్వ పథకాలే అస్త్రాలుగా ప్రజల్లోకి వెళ్లండి
  • ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో మంత్రి కొండా సురేఖ పిలుపు

భద్రాద్రికొత్తగూడెం/ ఖమ్మం రూరల్/మధిర/సత్తుపల్లి/వైరా/అశ్వారావుపేట, వెలుగు : మున్సిపల్ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ శ్రేణులు సైనికుల్లా కదలాలని, మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలని, సంక్షేమ పథకాలను ఆయుధాలుగా చేసుకుని ప్రతి ఇంటి గడపను తట్టాలని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం, మధిర, సత్తుపల్లి, వైరా, అశ్వారావుపేట, కొత్తగూడెంలో ఆమె పర్యటించారు. పలు చోట్ల ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల క్షేత్రంలో పార్టీ జెండా రెపరెపలాడడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

అధికారంలో ఉన్నప్పుడు పదవుల కోసం పోటీ ఉండటం సహజమని, అయితే పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. నేతలు చొరవ తీసుకుని అభ్యర్థులందరినీ ఏకతాటిపైకి తేవడం అభినందనీయమని పేర్కొన్నారు.  200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పెంపు లాంటి పథకాలు ప్రతీ కుటుంబానికి కొండంత భరోసా ఇచ్చాయని గుర్తు చేశారు.  

సోమవారం ఉదయం నాటికి అభ్యర్థులందరికీ బీ-ఫామ్‌లు అందజేస్తామని, అప్పటి నుంచే ముమ్మర ప్రచారం మొదలుపెట్టాలని సూచించారు. వార్డుల్లో ఘన విజయం సాధిస్తేనే మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కుతుందని, ఐక్యతతోనే అది సాధ్యమని పేర్కొన్నారు.పొత్తులు పెట్టుకునేందుకు ముందుకు రావాలని సీపీఐ నేతలకు సూచించారు.  కొత్త గూడెం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్​ పరిధిలో రెండోసారి సర్వే టీమ్​లు తిరుగుతున్నాయన్నారు.  

మంత్రి వెంట రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు,   ఇరు జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులునూతి సత్యనారాయణ, దేవి ప్రసన్న, మహిళా కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, రాష్ట్ర నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్, టీపీసీసీ జనరల్​ సెక్రటరీలు మోతూకరి ధరామరావు, నాగ సీతారములు, రాష్ట్ర మాజీ మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, పీసీసీ కార్యదర్శి కట్ల రంగారావు, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఇతర నాయకులు ఉన్నారు.