రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు మంత్రి కేటీఆర్  లీగల్  నోటీసులు

TSPSC  పేపర్ లీకేజీపై  కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు  మంత్రి కేటీఆర్  లీగల్  నోటీసులు పంపించారు.  తనపై  నిరాధారమైన , ఆసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ  నోటీసుల్లో  పేర్కొన్నారు. సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు పదేపదే అబద్ధాలను మాట్లాడుతున్నారన్నారు. తనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో తెలిపారు. 

వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని లేకపోతే  ఇండియన్ పీనల్ కోడ్‌లోని 499, 500 నిబంధనల ప్రకారం రూ. 100 కోట్ల పరువు నష్టం దావాను ఎదురుకోవాల్సి వస్తుందని కేటీఆర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు.  ఈ సందర్భంగా బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు చేసిన నిరాధార ఆరోపణలను సాక్షాలతో సహా తన నోటీసులు కేటీఆర్ ప్రస్తావించారు.

TSPSC పేపర్  లీక్ అంశంలో  మంత్రి కేటీఆర్  కార్యాలయానికి  సంబంధం ఉందని రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు ఆరోపించారు. ఈ కేసులో మంత్రి  కేటీఆర్  ను మంత్రివర్గం నుండి  భర్తరఫ్  చేయాలని  కూడా  డిమాండ్  చేశారు. అయితే రాజకీయ దురుద్దేశ్యంతోనే  రేవంత్, సంజయ్ లు తనపై ఆరోపణలు చేస్తున్నారని  కేటీఆర్ తన నోటీసుల్లో  పేర్కొన్నారు.