ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు

ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు

హైదరాబాద్: ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు మంత్రి కేటీఆర్. ముఖ్యంగా రెవిన్యూ, దేవాదాయ భూముల పైన ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. శనివారం MCR HRD(మర్రి చెన్నారెడ్డి హ్యుమ‌న్ రిసోర్స్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ )భ‌వ‌నంలో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం జ‌రిపారు. ఈ స‌మావేశంలో నగ‌రంలోని‌ ప్ర‌భుత్వ భూముల రక్షణ చ‌ర్య‌ల‌పై .. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లు, దేవాదాయ శాఖ అధికారుల‌తో మంత్రి చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు రెవెన్యూ తో జిహెచ్ఎంసి అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ స్థలాలకు జియో పెన్సింగ్, జిఐఎస్ మ్యాపింగ్ చేయాలన్నారు.

ప్రభుత్వ భూములపైన ఉన్న వివాదాలను పరిష్కరించేందుకు కోర్టుల్లో బలమైన వాదనలు వినిపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలను ప్రజాప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. ద‌శాబ్దాల కింద తీసుకున్న లీజ్ లను సమీక్షించాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లీజ్ నియమ నిబంధనలు మార్చి ఆయా శాఖలకు మరింత ఆదాయం వచ్చేలా చూడాల‌న్నారు. మరోసారి ఇలాంటి అవకాశాన్ని కల్పించే అంశంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ స‌మావేశానికి మంత్రి త‌ల‌సాని, సీఎస్ సోమేష్ కుమార్ లు కూడా హాజ‌ర‌య్యారు.