బీఆర్‌‌ఎస్‌‌ హయాంలో నేనే రాజు.. నేనే మంత్రి విధానం.. మంత్రి లక్ష్మణ్‌‌కుమార్‌‌ విమర్శ

బీఆర్‌‌ఎస్‌‌ హయాంలో నేనే రాజు.. నేనే మంత్రి విధానం..    మంత్రి లక్ష్మణ్‌‌కుమార్‌‌ విమర్శ

జగిత్యాల రూరల్, వెలుగు : ‘బీఆర్‌‌ఎస్‌‌ పాలనలో నేనే రాజు.. నేనే మంత్రి విధానం అమల్లో ఉండేది, మంత్రులకు సీఎం అపాయింట్‌‌మెంట్‌‌ కూడా దొరకకపోయేది’ అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌‌ విమర్శించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌‌కుమార్‌‌, జిల్లా కాంగ్రెస్‌‌ అధ్యక్షుడు నందయ్యతో కలిసి శుక్రవారం జగిత్యాలలో మంత్రి మీడియాతో మాట్లాడారు. రెండేండ్ల కాంగ్రెస్‌‌ పాలనను మెచ్చే.. ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ మద్దతుదారులను గెలిపించారన్నారు. 

గత ప్రభుత్వంలో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్‌‌ ఒక్క ఎస్సీ గురుకులానికైనా పక్కా భవనాన్ని నిర్మించారా అని ప్రశ్నించారు. మిగులు బడ్జెట్‌‌తో ఉన్న రాష్ట్రాన్ని ఖాళీ చేసి తమకు అప్పగించారని, అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. 

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నాటికి రోళ్లవాగు ప్రాజెక్ట్‌‌ సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయనందునే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని, బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు తమ ప్రభుత్వంపై అవాకులు, చవాకులు మాట్లాడడం మానుకోవాలని సూచించారు.