వర్షాలను సీఎం కేసీఆర్ ఆపుతారా..?

వర్షాలను సీఎం కేసీఆర్ ఆపుతారా..?

వరంగల్ జిల్లా: వర్షాలను సీఎం కేసీఆర్ ఆపుతారా అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానాకాలం 2022 పంటల సాగుకు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిరంజన్ రెడ్డితో పాటు జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సమావేశానికి అటెండయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డి.. సకాలంలో వరిపంట వేసుకుంటే అకాల వర్షాలతో నష్టాలు వచ్చేవి కావన్నారు. నవంబర్ లోనే సాగు ప్రారంభించిన రైతులు ఏప్రిల్ లోనే వరికోతలు పూర్తి చేసుకున్నారన్నారు. దీంతో ఎలాంటి నష్టంలేకుండా రైతులు లాభాలు పొందారని తెలిపారు.

ఎప్పుడైనా మే నెలలో అకాల వర్షాలు పడుతుంటాయని.. రాళ్ల వానలతో పంట నష్టం జరుగుతుందన్నారు. ఈదురుగాలులతో వచ్చే వర్షాలతో మామిడి తోటలు దెబ్బతింటాయన్నారు. కొంతమంది రైతులు నిర్లక్ష్యంగా పంటలు వేయడంతో అకాల వర్షాలకు నష్టాలపాలవుతున్నారన్న మంత్రి నిరంజన్ రెడ్డి.. వర్షాలను ఏమైనా సీఎం కేసీఆర్ చేయిపెట్టి ఆపగలరా అన్నారు. రాళ్లవానను ఆపగలరా.. ఈదురుగాలులతో వచ్చే వర్షాన్ని సీఎం కేసీఆర్ ఆపగలరా అని చెప్పుకొచ్చారు. 15 రోజులు ముందు వరిపంట వేస్కుంటే ఎలాంటి నష్టం ఉండదని.. లాభాలతో తెలంగాణ వ్యవసాయం ప్రపంచానికి చాటిచెప్పవచ్చన్నారు. ఇజ్రాయాల్ లాంటి చిన్న దేశం ఆదర్శంగా నిలుస్తుందంటే.. మన చిన్న తప్పులతోనే భారీ మూల్యం చెల్లించుకుంటున్నామని తెలిపారు. మన దగ్గర అన్ని పంటలు పండుతున్నాయని, వనరులు పుష్కలంగా ఉన్నా.. అవగాహన .. నిర్లక్ష్యతో రైతులు వెనుకపడుతున్నారన్నారు.  అవకాశాలను అందిపుచ్చుకుని సకాలంలో పంటలు వేయాలన్నారు. ఏ పంట వేస్తే లాభం జరుగుతుందో ఆలోచించి సాగు చేయాలని రైతులకు సూచించారు. 

ఆయిల్ పామ్ సాగు విషయంలో రైతులను చైతన్యం చేయడంలో విజయవంతం అయ్యామని.. ఉద్యాన, కాయగూరల్లో విభిన్న పంటల సాగుపై రైతులు దృష్టిసారించాలన్నారు. అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న తోతాపురి మామిడి, జామ, నిమ్మ, బత్తాయి, అరటి సాగు వైపు ఉద్యానశాఖ రైతులను ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయం ఆగిపోతే ప్రపంచం అంతరిస్తుందన్న నిరంజన్ రెడ్డి.. వ్యవసాయం బాగుపడి అన్నదాతల గౌరవించాలన్నారు. రైతు వేదికలలో నిరంతరం రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్న ఆయన.. ఆధునిక వ్యవసాయం, ఎరువులు, పురుగుమందుల యాజమాన్య పద్ధతులు వంటి వాటిపై చైతన్యం చేయాలని అధికారులను ఆదేశించారు.   ప్రభుత్వం ఆరుతడి పంటలు వేసుకోమంటే కొందరు తప్పుదోవ పట్టించారని తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి.