ఏ ఒక్క వ్యక్తిపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించదు : మంత్రి పొంగులేటి

ఏ ఒక్క వ్యక్తిపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించదు : మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల దగ్గరికే పాలన ఉండాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించామని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన సభలు గ్రామాల్లో ఉంటాయని చెప్పారు. ప్రతిరోజు అధికారుల బృందం 2 గ్రామాల్లో పర్యటిస్తుందన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన ఫామ్ లను ముందే ఇస్తామని, ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్లు స్వీకరిస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అర్హులందరికీ పథకాలు అందిస్తామని చెప్పారు. పథకాలపై ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. గత ప్రభుత్వం మాదిరిగా పథకాలకు కోత పెట్టమని చెప్పారు.

గతంలో కలెక్టర్ల మీటింగ్ అంటే వన్ సైడ్ బ్యాటింగ్ మాదిరిగా ఉండేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ్టి సమావేశంలో కలెక్టర్ల అభిప్రాయాలు విన్నామన్నారు. సమావేశంలో అధికారులు కొన్ని సూచనలు చేశారని తెలిపారు. ఇప్పటికే 6 గ్యారంటీల్లో 2 అమలు చేశామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై మంచి రెస్సాన్స్ వస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ని బంగాళాఖాతంలో కలుపుతుందని మాట్లాడిన వాళ్లనే... ప్రజలు వారి పార్టీని, వారిని బంగాళాఖాతంలో కలిపారని కామెంట్స్ చేశారు.  

కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క వ్యక్తిపై కక్షపూరితంగా వ్యవహరించదని స్పష్టం చేశారు. తప్పు చేస్తే ఎంత పెద్ద వాళ్లను అయినా ఉపేక్షించేది లేదన్నారు. ధరణితో చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నకిలీ విత్తనాలను అరికడుతామన్నారు. డ్రగ్స్ అమ్మకాలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారని చెప్పారు