తెలంగాణలో పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా నడుస్తున్నాయని.. ఇందులో భాగంగానే మొదటి విడతలోలక్ష ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేస్తున్నామని ఆయన ప్రకటించారు. జూన్ చివరి నాటికి మరో లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని మంత్రి వెల్లడించారు.
గత ప్రభుత్వం పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఇళ్లను నిర్మించి పేదలను ఇబ్బందులకు గురిచేసిందని మంత్రి పొంగులేటి విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం నిరుపేదల ఆత్మగౌరవం నిలబెట్టేలా ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తుందని హామీ ఇచ్చారు. నిరుపేదలు ఎక్కడ నివసిస్తున్నారో.. అక్కడే ఇళ్లను నిర్మిస్తామని, జీహెచ్ఎంసీ పరిధిలోని అత్యంత ఖరీదైన స్థలాల్లోనే పేదలకు ఇందిరమ్మ ఇళ్లను కట్టించి ఇస్తామని ఆయన ప్రకటన చేశారు.
జీహెచ్ఎంసీ పరిధిలో స్థలాలు లేకపోవడం వల్ల ప్రస్తుతానికి 18 వేల ఇళ్లకు ప్రొసీడింగ్స్ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే కొన్ని స్థలాలను గుర్తించామని, జీహెచ్ఎంసీ ఇళ్ల ఇష్యూపై ఇంచార్జ్ మంత్రులతో కూడా చర్చలు జరుపుతున్నామని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఫస్ట్ విడతలో లక్ష ఇండ్లు కట్టాలనేది ప్రభుత్వ టార్గెట్ అని.. ఫస్ట్ ఫేజ్ ముగిశాక సెకండ్ ఫేజ్‌లో మరిన్ని ఇళ్ల నిర్మాణం చేపడతామని వివరించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
అర్బన్ ప్రాంత పేదల సొంతింటి కలను నెరవేరుస్తూనే.. గ్రామీణ, గిరిజన ప్రాంతాలకూ ప్రాధాన్యత ఇస్తున్నామని పొంగులేటి తెలిపారు. ఇందులో భాగంగానే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లను కేటాయించామని, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా 5 వేల ఇళ్లను మంజూరు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
