- నిజాయితీ, నిబద్దత, క్రమశిక్షణతో పనిచేయండి
- కొత్తగా ఎంపికైన సబ్ రిజిస్ట్రార్లకు మంత్రి పొంగులేటి సూచన
హైదరాబాద్, వెలుగు: నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలోనే యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గ్రూప్ -2లో ఎంపికై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో సబ్ రిజిస్ట్రార్‌లుగా నియమితులైన 14 మంది గురువారం సెక్రటేరియెట్లో మంత్రి పొంగులేటిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వారిని మంత్రి అభినందించి, ఇండియన్ స్టాంప్ యాక్ట్ బుక్ లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో చాలా జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుందని, ఎటువంటి ప్రలోభాలకు తలొగ్గకుండా నిజాయితీ, నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేయాలన్నారు.
ఉద్యోగాల నియామక ప్రక్రియలో గత ప్రభుత్వం చూపించిన అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగ యువత ఆశలు అడుగంటిపోయాయన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన అరకొర ఉద్యోగ నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న అక్రమాలు, పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలతో అర్హులైన యువతకు ఉద్యోగాలు రాని పరిస్థితి ఏర్పడిందన్నారు.
