రాజకీయ కక్ష సాధింపు లో బీజేపీ టాప్ : మంత్రి పొన్నం

రాజకీయ కక్ష సాధింపు లో  బీజేపీ టాప్ : మంత్రి పొన్నం
  • దీనికి లిక్కర్ స్కామ్ కేసు తీర్పే నిదర్శనం: మంత్రి పొన్నం

కరీంనగర్, వెలుగు: రాజకీయ కక్ష సాధించడంలో బీజేపీ టాప్ అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. దీనికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వచ్చిన తీర్పే నిదర్శనమని చెప్పారు. శుక్రవారం కరీంనగర్‌లోని రేకుర్తిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. "ఢిల్లీలో కేజ్రీవాల్, తెలంగాణలో కవితకు లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా రాజకీయంగా అపవాదు మాత్రం అలాగే ఉండిపోతుంది. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో న్యాయస్థానాల ఆదేశాల మేరకే ప్రభుత్వ స్థలంలోని ఆక్రమణలను తొలగిస్తున్నాం. 

కావాలంటే ఆ తీర్పు కాపీలను కేంద్రమంత్రి బండి సంజయ్‌కు పంపిస్తాం. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. కాళేశ్వరం రుణాల కోసమే రెండేండ్లలో రూ.48 వేల కోట్లు చెల్లించాం.  కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వలేదు. కేంద్రం పూర్తిగా వివక్ష చూపుతున్నది. రాష్ట్ర బీజేపీ నేతలు ఏపీకి ఇచ్చిన నిధుల్లో కనీసం సగమైనా తేవాలి. రాష్ట్రంపై కక్షపూరితంగా వ్యవహరించడం మానేసి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ప్రజలకు బీజేపీ సమాధానం చెప్పాలి" అని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు.