దమ్ముంటే కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి గెలువు : మంత్రి పొన్నం

దమ్ముంటే కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి గెలువు : మంత్రి పొన్నం
  • కేటీఆర్​కు మంత్రి పొన్నం సవాల్

హైదరాబాద్, వెలుగు : మల్కాజిగిరి లోక్​సభ స్థానం నుంచి తనపై పోటీ చేయాలని సీఎం రేవంత్​రెడ్డికి సవాల్ విసురుతున్న కేటీఆర్​కు దమ్ముంటే కరీంనగర్​ ఎంపీగా పోటీ చేసి గెలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు. శుక్రవారం ఆయన సెక్రటేరియెట్లో మాట్లాడారు. ‘‘కరీంనగర్​ నుంచి ముగ్గురం ఎమ్మెల్యేలం ప్రాతినిధ్యం వహిస్తున్నం. నువ్వు సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కరీంనగర్ పార్లమెంట్ కు పోటీ చెయ్యి. మా ముగ్గురు ఎమ్మెల్యేలలో ఒకరు రాజీనామా చేసి పోటీ చేస్తం.

లేదంటే మంత్రి కోమటి రెడ్డి వెంకట్​రెడ్డి విసిరిన సవాల్ స్వీకరించాలె” అని అన్నారు. ‘‘మేడిగడ్డకు కాంగ్రెస్ నేతలు వెళ్తే ఏం పీకడానికి వెళ్లారని కేసీఆర్ అన్నరు. మరి ఇప్పుడు కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు ఏం పీకనీకి అక్కడి వెళ్లారు. కాళేశ్వరం కేసీఆర్ మానస పుత్రిక అన్నరు. మరి ఇప్పుడు బొందలగడ్డ అయ్యిందా?” అని పొన్నం ప్రశ్నించారు.

లక్ష కోట్లు వెచ్చించి నిర్మించామని చెప్తున్న కాళేశ్వరం విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామంటూ.. బీఆర్ఎస్​నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు కూలిపోవాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుందనే కేటీఆర్​విమర్శలపై మంత్రి స్పందిస్తూ.. ప్రాజెక్టు కట్టేప్పుడు ఎవ్వరినీ అనుమతించని మీరు ఇప్పుడు కాంగ్రెస్​ కుట్ర చేస్తుందనడం విడ్డూరంగా ఉందన్నారు.

ఎక్స్​పర్ట్స్​రిపోర్ట్​ మేరకు మేడిగడ్డపై నిర్ణయం

మేడిగడ్డకు నీరు వదిలితే ప్రమాదకరమని నిపుణుల సూచనల మేరకు తాము వేచి చూస్తున్నామన్నారు. నిపుణుల రిపోర్ట్ తర్వాత ఏం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు, స్కీముల్లో అవినీతిపై ఒక పక్క ఎంక్వైరీ జరుగుతుంటే.. కేటీఆర్ దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఎక్కడికి వెళ్లినా తప్పించుకోలేరని చెప్పారు.