- సెక్రటేరియెట్‌లో రవాణా శాఖపై మంత్రి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: రవాణా చట్టానికి లోబడి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రెవెన్యూ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. త్రైమాసిక పన్ను వసూలుకు సంబంధించి తక్కువగా నమోదు చేసిన వివిధ జిల్లాల అధికారులకు పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. 100 శాతం వసూలు చేసిన జిల్లాల అధికారులను అభినందించారు. సమావేశానికి రాని అధికారులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఆదేశించారు.
మంగళవారం సచివాలయంలో రవాణా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా రవాణా శాఖ అధికారులు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు, ఆర్టీవో లు తదితర అధికారులు ఇందులో పాల్గొన్నారు. ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్న రవాణా శాఖ ఆఫీసులకు సొంత భవనాలకు అవసరమైన ల్యాండ్ కోసం ముఖ్యమంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. జిల్లాల్లో విధిగా వాహనాల తనిఖీ చేయాలని ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్లు పూర్తి చేయాలని అన్నారు.
లైసెన్స్‌ల జారీ, రిజిస్ట్రేషన్ల డీ సెంట్రలైజ్పై స్టడీ
ప్రస్తుతం రవాణా శాఖకు సంబంధించిన వాహనాలను ఒకే గూటికి తీసుకొచ్చే విధంగా స్టిక్కరింగ్ ఉండేలా చూసుకోవాలని మంత్రి పొన్నం తెలిపారు. ప్రతి స్కూల్ బస్సును తనిఖీ చేయాలని డ్రైవర్లు, బస్సులకు ఫిట్నెస్ ఉంటేనే రోడ్డు ఎక్కేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్ల గ్లాస్‌కు బ్లాక్ ఫిలింలపై తనిఖీలు నిర్వహించాలన్నారు. హైదరాబాదులో ఆటో రిక్షాలపై ప్రస్తుతం ఉన్న పాలసీతో పాటు సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్ర సరిహద్దుల వద్ద ఉన్న చెక్ పోస్టులను, ఎన్ ఫోర్స్ మెంట్ ను మరింత బలోపేతం చేసి నిరంతరం నిఘా పెడితే ఆదాయాన్ని పెంచుకోవచ్చన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ల జారీ, రిజిస్ట్రేషన్ విషయంలో అవినీతికి ఆస్కారం లేకుండా డీసెంట్రలైజ్ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై స్టడీ చేయాలని సూచించారు. సమావేశంలో స్పెషల్ సెక్రట రీ విజయేంద్ర బోయి, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు ప్రవీణ్, రమేశ్మమత తదితరులు పాల్గొన్నారు.