ఎల్కతుర్తి/ భీమదేవరపల్లి, వెలుగు: రాజకీయాలు, అభివృద్ధి వేర్వేరని, అందరం కలిసి పనిచేస్తేనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆయన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో పర్యటించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతి ప్రణాళికలో చేపట్టాల్సిన పనులపై అధికారులు, సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ రివ్యూ నిర్వహించారు.
అనంతరం గట్ల నర్సింగాపూర్ కేజీబీవీ స్కూల్‌ను సందర్శించి, పదో తరగతి విద్యార్థులకు సూచనలిచ్చారు. వారితో కలిసి భోజనం చేశారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకున్నట్లే పరిసరాలను, వాడలను, ఊరిని పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ఏడాదికోసారైనా వైద్య పరీక్షలు చేసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు.
మహిళా సంఘాలకు ఇచ్చిన స్టీల్ బ్యాంక్ వినియోగిస్తూ పర్యావరణ పరిరక్షణ కు కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని, డ్రగ్స్‌కు పిల్లలు అడిక్ట్ కాకుండా తల్లిదండ్రులు గమనించాలన్నారు. 2025 మార్చి లోపు చేసిన పనుల బిల్లులను కొత్త సర్పంచ్ లు ఆపొద్దన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రవి, డీఆర్డీవో మేన శ్రీను, డీఎంహెచ్‌వో అప్పయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజీ తదితరులున్నారు.
