హుస్నాబాద్  ఇక విద్యా హబ్ : మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్  ఇక విద్యా హబ్ : మంత్రి పొన్నం ప్రభాకర్
  • శాతవాహన ఇంజనీరింగ్​ కాలేజీ ల్యాండ్​ పత్రాలు అందజేత

హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్​ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన విద్యా హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు. గురువారం మండలంలోని ఉమ్మాపూర్​లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్​ కాలేజీ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేబినెట్ ఆమోదం పొందిన ల్యాండ్​ పత్రాలను యూనివర్సిటీ వీసీ ఉమేశ్​కు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను చేరువ చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కాలేజీ నిర్మాణానికి ఇప్పటికే నిధులు విడుదలయ్యాయని, టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని చెప్పారు. 36 ఎకరాల్లో భవన నిర్మాణంతో పాటు స్టూడెంట్ల కోసం హాస్టల్​ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గానికి అడ్వాన్స్​డ్  టెక్నాలజీ సెంటర్, న్యాక్​ సెంటర్లను ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. గాంధీనగర్​ పాలిటెక్నిక్​ కాలేజీ ఆవరణలో 1.5 ఎకరాల్లో ఏటీసీ, కూచనపల్లి–-మాలపల్లి మధ్య న్యాక్​ సెంటర్​ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా యువతకు వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ లభిస్తుందని చెప్పారు.

మేరు కులస్తులకు ప్రాధాన్యం..

బీసీ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో త్వరలో చేపట్టనున్న కుట్టు మెషీన్ల పంపిణీలో మేరు కులస్తులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి పొన్నం తెలిపారు. అక్కు శ్రీనివాస్​ ఆధ్వర్యంలో గురువారం మేరు సంఘం ప్రతినిధులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. కులవృత్తినే నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ మెషీన్లు అందించాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్  చైర్​ పర్సన్  దండి లక్ష్మి, వైస్  చైర్​ పర్సన్  చిత్తారి పద్మ, బంక చందు, లింగమూర్తి, రవి, రమణ, శ్రీనివాస్, రాజు, రాజ్​కుమార్  పాల్గొన్నారు.