- సిటీ స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్లు రెడీ చేయాలి
- హైదరాబాద్ కలెక్టరేట్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో ముందుంచేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై కలెక్టరేట్‌లో అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ దాసరి హరిచందన, అడిషనల్ కలెక్టర్ జితేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ .. నగర స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక విధానంతో ప్లాన్లు రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ పురోగతిపై చర్చించారు. విద్యారంగం, రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాల పనితీరును తెలుసుకున్నారు.
దవాఖానల నెట్‌వర్క్, బస్తీ దవాఖానాలు, ప్రజారోగ్య సౌకర్యాలపై వైద్యాధికారుల నివేదికలు పరిశీలించారు. జిల్లాలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అర్హులకు పథకాలు అందించాలని సూచించారు. లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ జితేందర్ రెడ్డి, డీఆర్‌వో వెంకటాచారి, సీపీవో సురేందర్, జిల్లా సంక్షేమ అధికారులు జి. ఆశన్న, అక్కేశ్వరరావు, ఇలియాస్ అహ్మద్, ప్రవీణ్ కుమార్, కోటాజి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి, జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అవసరమున్న ప్రతిచోట పార్కు
జూబ్లీహిల్స్ : సిటీలో అవసరమైన ప్రతిచోట పార్కులు, పిల్లలకు ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో 1 ఎకరా 40 గుంటల స్థలంలో సుమారు రూ. 3.10 కోట్లతో అభివృద్ధి చేసిన చిల్డ్రన్ ప్లే పార్ను సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జోనల్ కమిషనర్ ప్రియాంక అలాతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం కొత్తగా ఏర్పాటు చేసిన టెన్నిస్ కోర్టులో వేం నరేందర్ రెడ్డి, మేయర్‌తో కలిసి టెన్నిస్ ఆడారు.
