- విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
కొమురవెల్లి, వెలుగు : ‘విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌పై రాజకీయ విమర్శలు చేయడం సరికాదు. రిపోర్ట్‌లో తప్పులు ఉంటే సలహాలు, సూచనలు ఇవ్వకుండా విమర్శలు చేయడం సిగ్గుచేటు’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం కొమురవెల్లిలో మీడియాతో మాట్లాడారు. సమాజాభివృద్ధి కోసం విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌ను తాను స్వాగతిస్తున్నానని చెప్పారు.
తాను విద్యార్థి సంఘ నాయకుడి స్థాయి నుంచే మంత్రి స్థాయికి ఎదిగానని గుర్తు చేశారు. యూనివర్సిటీల్లో సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఎంతో మంది ప్రతిభావంతులైన యువకులు రాజకీయాలకు దూరం అయిపోతున్నారన్నారు. కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 50 వసతి గదులు, క్యూకాంప్లెక్స్ పనులు చివరి దశకు చేరుకున్నాయని, వాటిని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు.
అంతకుముందు కుటుంబసమేతంగా మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో కృష్ణప్రసాద్, అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో పట్నం వేసి, బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన వెంట మండల అధ్యక్షుడు మహదేవుని శ్రీనివాస్, ఆలయ చైర్మన్ గంగం నర్సింహారెడ్డి, మాజీ జడ్పీటీసీలు కొమ్ము నర్సింగరావు, గిరి కొండల్‌రెడ్డి, నాయకులు లింగంపల్లి శ్రీనివాస్, లింగంపల్లి కనకరాజు, గుండా మహేశ్ ఉన్నారు.
