హుస్నాబాద్, వెలుగు: పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని, లేదంటే యాక్షన్ తప్పదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ఇక ఆలస్యం చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో అభివృద్ధి పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. రైతుల విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని ఆదేశించారు. వడ్లు, మక్కల కొనుగోళ్లలో సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించాలని సూచించారు. తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచేందుకు బడిబాటను యాక్షన్ మోడ్‌లో అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. వన మహోత్సవం, హెల్త్ క్యాంప్‌లను ప్రజలకు ఉపయోగపడేలా నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్ హైమావతి, ఆర్డీవో రామ్మూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆత్మ కమిటీ చైర్మన్ ఐలయ్య పాల్గొన్నారు.
ప్రతి గ్రామంలో ఐదుగురితో కమిటీలు..
ప్రతి గ్రామంలో ఐదుగురు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయాలని పార్టీ శ్రేణులకు మంత్రి పొన్నం సూచించారు. తాగునీరు, విద్య, వ్యవసాయం, మొక్కలు నాటడం వంటి కీలక అంశాలపై ఈ కమిటీలు నిఘా పెట్టాలని తెలిపారు. మండలంలో రూ.14 కోట్లతో రోడ్ల పనులు ఇప్పటికే స్టార్ట్ చేశామని చెప్పారు. ఓటరు జాబితాల్లో దొంగ ఓట్లు ఎంటర్ కాకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని హెచ్చరించారు. కాంగ్రెస్ సపోర్టర్ల ఓట్లు డిలీట్ కాకుండా ప్రతి బూత్‌కు ఒక బీఎల్ఏను నియమించుకోవాలని సూచించారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాల ప్రచారంలో కార్యకర్తలు యాక్టివ్‌గా ఉండాలని పిలుపునిచ్చారు.
టెన్త్ రిజల్ట్స్‌లో ప్రభుత్వ స్కూళ్లదే పైచేయి..
టెన్త్ రిజల్ట్స్‌లో ప్రభుత్వ స్కూళ్లు అదరగొట్టాయని మంత్రి కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా 5,731 స్కూళ్లు 100 శాతం ఫలితాలు సాధించడం గొప్ప విషయమన్నారు. ప్రైవేటుకు దీటుగా గవర్నమెంట్ స్టూడెంట్స్ రాణించారని చెప్పారు. మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులాలు 98.99 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో రెండో స్థానం దక్కించుకోవడం గర్వకారణమన్నారు.

