కొడుకుపై విచారణకు సంజయ్ సహకరించాలి..విచారణను అడ్డుకుంటామంటే సహించం: మంత్రి పొన్నం 

కొడుకుపై విచారణకు సంజయ్ సహకరించాలి..విచారణను అడ్డుకుంటామంటే సహించం: మంత్రి పొన్నం 
  • బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ 

హైదరాబాద్, వెలుగు: సాయి భగీరథ్‌ పై నమోదైన పోక్సో కేసు విచారణకు అతని తండ్రి బండి సంజయ్ సహకరించాలని, పదవిని అడ్డుపెట్టుకొని కేసును అడ్డుకుంటామంటే ఉపేక్షించేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. సోమవారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ కేసులో బాధిత కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. తమ ప్రభుత్వానికి ఎవరి పట్ల ప్రేమ, వివక్ష ఉండదని స్పష్టం చేశారు.

మహిళల పట్ల ఎవరు అసభ్యంగా ప్రవర్తించినా చర్యలు తప్పవని, పోలీసులు తమ బాధ్యతలను విస్మరిస్తే వారిపైనా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మోదీ తెలంగాణ పర్యటనలో మాట్లాడిన మాటలు ప్రధాని స్థాయిలో లేవని విమర్శించారు. బంగారం కొనొద్దు, వంట నూనె వాడొద్దు, విదేశాలకు వెళ్లొద్దని మాట్లాడడం సరైంది కాదన్నారు. మోదీ తెలంగాణకు వస్తే రాష్ట్రానికేమైనా ఇస్తారని రాష్ట్ర ప్రజలు ఆశించారని, కానీ ఆయన పెద్ద కోడి గుడ్డు ఇచ్చిపోవడంతో మీకో దండం అంటూ ప్రజలు మోదీ టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కామెంట్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

తెలంగాణకు కేంద్రం నుంచి తెచ్చిన నిధులెన్నో బీజేపీ నేతలు చెప్పాలని, దీనిపై సికింద్రాబాద్ టవర్ సర్కిల్‌‌‌‌‌‌‌‌లో చర్చకు తాము సిద్ధమని పొన్నం సవాల్ విసిరారు. పక్క రాష్ట్రం ఎన్ని నిధులు అడిగితే అన్ని నిధులు ఇస్తున్నారని, మరి తెలంగాణ ఏం పాపం చేసిందని ప్రశ్నించారు. జనగణన ఫారమ్‌‌‌‌‌‌‌‌లో కాలం నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌13లో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక గుర్తింపు ఉన్నట్లుగానే, బీసీ ఇండ్లను కూడా లెక్కించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.