వరంగల్, వెలుగు : హమాలీల సంక్షేమంతో పాటు వారికి ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క చెప్పారు. హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారి గ్రౌండ్‍లో ఆదివారం రాష్ట్ర హమాలీ సంఘం మహా గర్జన నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డితో కలిసి అంబేద్కర్ జంక్షన్ నుంచి సభా స్థలం వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం నిర్వహించిన మహా గర్జనలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. హామాలీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వారికి ఇచ్చిన హామీ ప్రకారం... సంక్షేమ బోర్డు ఏర్పాటు, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ వంటి అంశాలపై ప్రభుత్వంతో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ... హమాలీ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారన్నారు. కార్మికులు ఐక్యపోరాటాలతో హక్కులు సాధించుకోవాలని సూచించారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ... సమాజాభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమన్నారు. హమాలీల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించనున్నట్లు చెప్పారు. హమాలీల సంక్షేమానికి తన వంతుగా సీడీఎఫ్ నిధుల నుంచి రూ.20 లక్షలు విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రచయిత మిట్టపల్లి సురేందర్, గాయకుడు చుక్క రాంర్సయ్య, హమాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంటి సామ్రాజ్యం, ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
