- ప్రజా భవన్లో ప్రారంభించిన మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కిశోర బాలికల(15 నుంచి 18 ఏండ్ల వయసు) కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘స్నేహ సంఘాలు’ ఏర్పాటు చేసింది. మహిళా స్వయం సహాయక సంఘాల మాదిరిగానే ఇవి పనిచేయనున్నాయి. శుక్రవారం మంత్రి సీతక్క హైదరాబాద్ప్రజా భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్నేహ సంఘాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి కిశోర బాలికను స్నేహ సంఘంలో చేర్పించేలా అధికారులు కృషిచేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 19.13 లక్షల మంది కిశోర బాలికలు ఉన్నారని చెప్పారు.
ఇందులో 65,615 మందితో కలిపి 6,138 కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. కిశోర బాలికలకు ఆరోగ్యం పట్ల అవగాహన, మానసిక ఆరోగ్యం, రుతుక్రమ సమయంలో శుభ్రతపై శిక్షణ, అనీమియా తగ్గింపు, సరైన పోషకాహారంపై ప్రోత్సాహం, సైబర్ భద్రత, ఆన్లైన్ దుర్వినియోగాల నివారణ, స్కిల్ ట్రైనింగ్, కెరీర్ మేళాలు, ఆర్థిక స్వావలంబన కార్యక్రమాలపై స్నేహ సంఘాల ద్వారా అవగాహన కల్పించనున్నారు. ప్రతి యువతి సురక్షితంగా, ఆరోగ్యవంతంగా, ఆత్మవిశ్వాసంతో సమాజానికి నాయకురాలిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్నేహ సంఘాలు పనిచేయనున్నాయి. కార్యక్రమంలో సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, కమిషన్ సభ్యురాలు గోగుల సరిత, టీజీ ఫుడ్స్ చైర్ పర్సన్ ఫహీం తదితరులు పాల్గొన్నారు.
నేటి తరానికి నెహ్రూ ఆలోచనలు స్ఫూర్తి
దేశ నిర్మాణం కోసం జీవితాన్నే అర్పించిన వ్యక్తి: సీతక్క
హైదరాబాద్, వెలుగు: దేశ నిర్మాణం కోసం తన జీవితాన్నే అర్పించిన వ్యక్తి తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అని, ఆయన త్యాగాలు, దేశాభిమానం ప్రతి భారతీయునికి ప్రేరణ అని మంత్రి సీతక్క అన్నారు. పదేండ్లు జైలు జీవితం గడిపి, తన ఆస్తి మొత్తాన్ని దేశానికి రాసిచ్చారని, ఆయన నైతిక విలువలు నేటి తరానికి మార్గదర్శకాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బేగంపేట సెస్ ఆడిటోరియంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. చిన్నారుల సంరక్షణ, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక కార్యక్రమాలు చేపడుతున్నదని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ బోధన నుంచి పిల్లల పోషకాహారం వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటోందని తెలిపారు.
నేటి బాలలే రేపటి పౌరులని, చదువుతో ఎదుగుతూ వినయంతో మెలగాలని సూచించారు. ఏ చిన్న కష్టానికైనా పిల్లలు వెనకడుగు వేయకుండా, సవాళ్లను అవకాశాలుగా మలుచుకొని ముందుకు సాగితేనే విజయాలు సాధ్యమవుతాయన్నారు. మహిళల సంక్షేమం కోసం నూతన విధానాన్ని రూపొందించే క్రమంలో నిపుణులు, మేధావులతో ఈ నెల 18న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద మాట్లాడుతూ.. పిల్లలను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వంతో పాటు సమాజానికి కూడా ఉందన్నారు.
చిన్నారులపై జరిగే వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, బాలల హక్కుల కమిషన్ సభ్యులు కంచర్ల వందన గౌడ్, మరిపల్లి చందన, బండి అపర్ణ, గోగుల సరిత, ప్రేమలత అగర్వాల్, బి.వచన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
