- నేటి నుంచి కార్యక్రమం ప్రారంభం
- నిధులు ఇష్టారీతిన ఖర్చు చేస్తే చర్యలు
- పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సక్సెస్చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. గురువారం సెక్రటేరియెట్నుంచి జిల్లాల సీఈవోలు, డీపీవోలు, డీఆర్డీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల్లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికను శుక్రవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
99 రోజులపాటు పల్లెల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గ్రామీణులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. గతంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రాకపోవడం, సర్పంచ్‌లు లేకపోవడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా సాగలేదని చెప్పారు. ఇప్పుడు నిధులున్నాయని, ప్రజాప్రతినిధులు కూడా ఎన్నికైనందున అధికారులు కష్టపడితే పల్లెల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావొచ్చని పేర్కొన్నారు.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రగతి నివేదిక రూపంలో విడుదల చేయాలన్నారు. పనుల జాతరలో భాగంగా ప్రారంభించిన పనులను పూర్తి చేయాలని సూచించారు. బాల్య వివాహాల నిర్మూలన ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. 2023–24లో చేపట్టిన పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం15వ ఆర్థిక సంఘం నిధులు 245 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. ఈ మొత్తాన్ని పారిశుధ్యం, తాగునీటి పనులకే వినియోగించాలని, ఇష్టారీతిన ఖర్చు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
