
- కేంద్రాలను సురక్షిత భవనాల్లోకి మార్చాలని మంత్రి సీతక్క ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 580 అంగన్వాడీ భవనాలు దెబ్బతిన్నాయని మంత్రి సీతక్కకు అధికారులు నివేదిక అందజేశారు. పైకప్పుల లీకేజీలు, గోడలు, బేస్‌మెంట్‌లో పగుళ్లు, ఫ్లోర్ దెబ్బతినడం వంటివి ఎక్కువగా ఉన్నాయని రిపోర్టులో పేర్కొన్నారు. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 100, కొత్తగూడెంలో 75, కామారెడ్డి జిల్లాలో 49 భవనాలు దెబ్బతిన్నాయి. ఈ భవనాల రిపేర్లకు భారీగా నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు. ఆయా భవనాల రిపేర్లకు రూ.17 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు.
కొత్తగూడెం, నిర్మల్, కామారెడ్డి, గద్వాల, హనుమకొండ, మెదక్, వనపర్తి, ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో వందల సంఖ్యలో అంగన్వాడీ భవనాలు దెబ్బతి న్నాయని, కొన్ని కేంద్రాల్లో వర్షపు నీరు లోపలకు చేరడంతో బియ్యం, పప్పులు, పాల డబ్బాలు, నూనె ప్యాకెట్లు, స్టడీ మెటీరియల్ తడిసిపోయాయని నివేది కలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో తడిసిన భవనాల్లో అంగన్వాడీ సేవలను నిలిపివేయాలని, సమీపంలోని ప్రభుత్వ భవనాలు లేదా పాఠశాలల్లో కేంద్రాలను తాత్కాలికంగా కొనసాగించాలని మంత్రి సీతక్క అధికారులు ఆదేశించారు.