
న్యూఢిల్లీ, వెలుగు: ఆదివాసీ మహిళగా తాను కష్టాలు, అన్యాయాల్ని ప్రత్యక్ష్యంగా ఎదుర్కొన్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. వాటన్నింటినీ తట్టుకొని ప్రస్తుతం అధికారానికి ఉదాహరణగా నిలబడినట్టు చెప్పారు. కేరళ రాజధాని తిరువనంతపురం వేదికగా జరుగుతున్న దళిత ప్రగతి సదస్సులో సీతక్క పాల్గొని, ప్రసంగించారు. ఆదివాసీ వర్గం నుంచి వచ్చిన తాను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా.. ప్రస్తుతం తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గా సేవలందించే స్థాయికి ఎదిగానని చెప్పారు.
అయితే ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్టు గుర్తు చేశారు. ‘‘దళితుల హక్కుల కోసం మాట్లాడుతున్న ఈ వేళ.. సమాజం లోతుగా చొచ్చుకొని ఉన్న వ్యవస్థీకృత అణచివేతపైన పోరాడాలి. అలాగే అమరుల త్యాగాల్ని, వారు సాధించిన విజయాల్ని స్మరించాల్సిన అవసరం ఉంది. అయ్యంగార్ మొదలు నంగేలీ వరకు ఎంతో మంది భావితరాల బాగు కోసం పోరాడారు. ఈ దేశ దళిత ఆదివాసులుగా మనకు గొప్ప ప్రతిఘటన విప్లవ చరిత్ర ఉందన్నది మరవద్దు. బ్రిటిషర్స్ నుంచి నేటి వరకు చేస్తున్న అస్తిత్వ ఉద్యమాలు అందులో భాగమే. ఈ చరిత్ర నుంచి మనం స్ఫూర్తి పొంది, సమసమాజం కోసం పోరాడాల్సిన అవసరం ఉంది” అని పిలుపునిచ్చారు. మానవాళి చరిత్రలో దళితులుగా మనం ఎన్నో చీకటి రోజుల్ని చూశామని, ప్రతిసారి ఎదురొడ్డి నిలబడ్డామని చెప్పారు. ఇదే పోరాట పటిమను చూపిస్తూ.. భావితరాలకు మంచి భవిష్యత్తు కోసం పాటుపడదామని అన్నారు.