యువత బీఆర్ఎస్ ట్రాప్ లో పడొద్దు : మంత్రి సీతక్క

యువత బీఆర్ఎస్  ట్రాప్ లో పడొద్దు : మంత్రి సీతక్క

మహబూబాబాద్/కొత్తగూడ, వెలుగు : రాష్ట్రంలోని యువత బీఆర్ ఎస్ ట్రాప్ లో పడొద్దని మంత్రి సీతక్క సూచించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ ఎస్ లీడర్లు అధికారం కోల్పోగానే యువతపై కపట ప్రేమ నటిస్తూ, వారిని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన బీఆర్ఎస్ నాయకులు.. అధికారంలోకి వచ్చాక పదేండ్లు యువతను విస్మరించారన్నారు. 

గతంలో నిరుద్యోగులు ప్రవళిక, బోడ సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో యువతను అవమానించేలా కేటీఆర్ మాట్లాడారని గుర్తు చేశారు. నోటిఫికేషన్లు, కోర్టు కేసులు, పేపర్ లీకేజీలతోనే బీఆర్ ఎస్ పాలన ముగిసిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి ఇచ్చాక ఇప్పటివరకు 74 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించినట్లు చెప్పారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీఆర్ ఎస్ లీడర్లు యువతను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు. యువతీయువకులు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు.